నాని.. కెరీర్లో మొట్టమొదటిసారి

నాని.. కెరీర్లో మొట్టమొదటిసారి

ఇటీవలే ‘జెర్సీ' సినిమాతో పలకరించాడు  నేచురల్ స్టార్ నాని. దీని తర్వాత అతను విక్రమ్ కుమార్ సినిమా ‘గ్యాంగ్ లీడర్'తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇది సెట్స్ మీద ఉండగానే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుకు సైన్ చేశాడు. తన తొలి చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబుతో కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నట్లు అతను ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.

చాలా రోజులుగా చర్చల్లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఈ రోజే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీకి ‘వి' అనే టైటిల్ ఖరారు చేశారు. ఆసక్తికర పోస్టర్ కూడా వదిలారు. ఐతే పోస్టర్ మీద నటీనటులుగా సుధీర్ బాబు, నివేథా థామస్, అదితి రావు హైదరిల పేర్లు మాత్రమే కనిపించాయి. నాని పేరు ఎక్కడా లేదు.

దీంతో నాని ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అన్న సందేహాలు కలిగాయి జనాలకు. ఐతే సస్పెన్సుకు తెరదించుతూ నాని తానీ చిత్రంలో నటిస్తున్న సంగతి ఖరారు చేశాడు. ఈ ప్రాజెక్టు గురించి వెల్లడిస్తూ తన పాత్ర గురించి ఆసక్తికర విషయం చెప్పాడు నాని. తనను హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఇంద్రగంటి.. ఇప్పుడు తనను రీఇంట్రడ్యూస్ చేస్తున్నాడని.. ఇందులో తనది చాలా ప్రత్యేకమైన పాత్ర అని చెబుతూ.. ‘బ్యాడ్ యాస్' అనే మాట వాడాడు నాని. దీన్ని బట్టి చూస్తే నానిది ఇందులో నెగెటివ్ క్యారెక్టర్ అనే విషయం అర్థమవుతోంది. ఇంతకుముందు ఇంద్రగంటితో చేసిన ‘జెంటిల్‌మ్యాన్‌'లో విలన్ లాగా కనిపించే హీరో పాత్ర చేశాడు నాని.

ఐతే ఈసారి పూర్తిగా నెగెటివ్ రోలే చేస్తున్నట్లు అనిపిస్తోంది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇంద్రగంటి తన కెరీర్లో ఇప్పటిదాకా చేసిన థ్రిల్లర్ మూవీ ఒక్క ‘జెంటిల్‌మ్యాన్' మాత్రమే. మళ్లీ ఇప్పుడు ఆ జానర్లో సినిమా ట్రై చేస్తున్నాడు. ఆయన గత సినిమా ‘సమ్మోహనం' కూడా సుధీర్ బాబు, అదితి రావు హైదరిలతోనే చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ జోడీని రిపీట్ చేస్తున్నాడు. వీరికి నివేథా కూడా కలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English