ఇది కనీ వినీ ఎరుగని కలెక్షన్ ప్రభంజనం

ఇది కనీ వినీ ఎరుగని కలెక్షన్ ప్రభంజనం

గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన హాలీవుడ్ మూవీ ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ కలెక్షన్ల ప్రభంజనం చూసి ట్రేడ్ పండిట్లే షాకైపోతున్నారు. ఇది తొలి వారాంతంలో అనూహ్యమైన వసూళ్లు సాధిస్తుందన్న అంచనాలు ముందు నుంచి ఉన్నాయి. కానీ వాస్తవ వసూళ్లు అంచనాల్ని కూడా దాటిపోయాయి.

కేవలం మూడు రోజుల తొలి వీకెండ్లో ఈ సినిమా ఏకంగా 1.2 బిలియన్ డాలర్లు కొల్లగొట్టడం విశేషం. అంటే అక్షరాలా 8400 కోట్ల రూపాయలు వసూలు చేసిందన్నమాట ఈ చిత్రం. రెండు గంటల వినోదం పంచే ఒక సినిమా మూడే మూడు రోజుల్లో 8400 కోట్ల రూపాయలు వసూలు చేయడం అన్నది నమ్మశక్యం కాని విషయం. సినిమా పవర్ ఏంటన్నదో చెప్పడానికి ఇది రుజువు. సినిమాను తక్కువగా అంచనా వేసేవాళ్లకు కూడా ఇది ఒక పాఠమే.

రెండేళ్ల కిందట ‘ఎవెంజర్స్: ది ఇన్ఫినిటీ వార్’కు కూడా భారీగానే క్రేజ్ వచ్చింది. కానీ ఈ సిరీస్‌లో వచ్చిన చివరి సినిమా ‘ది ఎండ్ గేమ్’కు క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇండియా లాంటి దేశాల్లో దీనికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్.. ఓపెనింగ్ వీకెండ్లో వచ్చిన వసూళ్లు షాకింగే. ‘బాహుబలి’ మినహా ఏ సినిమాకూ ఇంత క్రేజ్ కనిపించలేదు. ఇండియాలో ఈ చిత్రానికి తొలి వారాంతంలో రూ.200 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు అంచనా.

అమెరికాలో ఈ చిత్రం ఏకంగా 340 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది తొలి మూడు రోజుల్లో. ఇంతకుముందు ‘ఎవెంజర్స్: ది ఇన్ఫినిటీ వార్’ 260 మిలియన్ డాలర్లతో నెలకొల్పిన వీకెండ్ వసూళ్ల రికార్డును ‘ది ఎండ్ గేమ్’ బద్దలు కొట్టింది. ఈ ప్రభంజనం చూస్తుంటే ఫుల్ రన్లో ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ 3 బిలియన్ డాలర్ల మార్కును అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English