ఆ సినిమా ఎందుకు పట్టాలెక్కట్లేదు?

ఆ సినిమా ఎందుకు పట్టాలెక్కట్లేదు?

ప్రయోగాత్మక, విభిన్నమైన సినిమాలు చేస్తూ ఒక దశలో చాలా ప్రామిసింగ్‌గా కనిపించాడు నారా రోహిత్. అతడి తొలి సినిమా ‘బాణం’ దగ్గర్నుంచి అతడిది విభిన్నమైన ప్రయాణమే. కానీ కొన్ని ప్రయోగాలు దారుణంగా వికటించడంతో రోహిత్ కెరీర్ తిరగబడింది. క్రమంగా మార్కెట్ దెబ్బ తినేసి.. రేసులో బాగా వెనుకబడిపోయాడు. ఒక దశలో అరడజనుకు పైగా సినిమాల్ని లైన్లో పెట్టిన అతను... ఇప్పుడు దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ఆల్రెడీ అనౌన్స్ చేసిన సినిమాను కూడా పట్టాలెక్కించలేకపోతున్నాడు. రోహిత్‌తో ‘బాణం’ సినిమా తీసిన యువ దర్శకుడు చైతన్య దంతులూరి.. మరోసారి తన తొలి చిత్ర కథానాయకుడితో ‘అనగనగనా దక్షిణాదిలో’ అనే సినిమాను గత ఏడాది మధ్యలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఆసక్తికర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆకర్షించిన ఈ చిత్రం కేవలం ప్రకటనకే పరిమితం అయింది. ఇప్పటిదాకా అది సెట్స్ మీదికి వెళ్లలేదు. ఇంతకుముందు ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను తన మిత్రులతో కలిసి నిర్మించిన రోహిత్.. మరోసారి అదే బేనర్లో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నాడు. కానీ ఇంతకుముందులాగా రోహిత్‌‌కు అంత సులువుగా ఫైనాన్స్ దొరకట్లేదని.. ఈ సినిమాను భారీ బడ్జెట్లో తెరకెక్కించాల్సి ఉండటంతో డబ్బులు సమకూర్చుకోవడం కష్టమవుతోందని సమాచారం. మంచి స్క్రిప్టు అందుబాలులో ఉన్నప్పటికీ.. ఇది చాలా రిస్కీ ప్రాజెక్టు కావడంతో ముందుకు కదలడం లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఒక దశలో ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి ఇక షూటింగ్ మొదలుపెట్టడమే తరువాయి అనుకున్న చిత్ర బృందం.. కొన్ని నెలలుగా సైలెంటుగా ఉంటోంది. మరి ఎప్పుడు ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English