రాఘవ లారెన్స్.. మెగా బడ్జెట్ మూవీ

రాఘవ లారెన్స్.. మెగా బడ్జెట్ మూవీ

ఒకప్పుడు రాఘవ లారెన్స్‌ దర్శకుడిగా మారుతున్నాడంటే అందరూ కామెడీగా తీసుకున్నారు. అతనేంటి డైరెక్షన్ చేయడమేంటి అని సందేహాలు వ్యక్తం చేశారు. అక్కినేని నాగార్జున లాంటి వాడు అతడిని నమ్మి సినిమా చేస్తుంటే ఆశ్చర్యపోయారు. కానీ నాగ్ నమ్మకమే నిలబడింది. ‘మాస్’ సినిమాతో లారెన్స్ సత్తా చాటాడు. ఆ తర్వాత కూడా చాలా హిట్లిచ్చాడు. ముఖ్యంగా ‘కాంఛన’ సిరీస్‌లో అతను తీసిన సినిమాలన్నీ వసూళ్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు ‘కాంఛన-3’ ఎలా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోందో తెలిసిందే. దీని తర్వాత ‘కాంఛన’ సిరీస్‌లో కొత్త సినిమా చేయబోతున్నట్లు సంకేతాలిచ్చాడు లారెన్స్. ఐతే అది పట్టాలెక్కడానికి సమయం పడుతుంది. ఈ లోపు ‘కాంఛన’ హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేయబోతున్న లారెన్స్.. ఆపై తమిళంలో ఓ మెగా బడ్జెట్ మూవీ పట్టాలెక్కించనున్నాడు.

‘కాంఛన-3’ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ బేనర్ మీదే ఈ సినిమా తెరకెక్కనుంది. ఇది కూడా హార్రర్ సినిమానే అట. ఐతే దీన్ని త్రీడీలో తీస్తాడట. ఇందులో కామెడీకి స్కోప్ లేకుండా పూర్తి స్థాయి హార్రర్ థ్రిల్లర్‌గా మలచనున్నాడట లారెన్స్. ఇది పాముల చుట్టూ తిరిగే సినిమా అని కూడా అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు చాలా ప్రాధాన్యం కూడా ఉంటుందట. లారెన్స్ కెరీర్లో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా చెబుతున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను తీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ‘కాంఛన’ సిరీస్‌లో వరుసగా రెండో సినిమాతో వంద కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నాడు లారెన్స్. అతను పెద్ద కాస్టింగ్‌తో ఇంకా భారీ  స్థాయిలో సినిమా తీస్తే అందుకు తగ్గట్లే మార్కెట్ చేసుకోవడానికి అవకాశముంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English