ఈ వర్కవుట్ల గోలేంటి బాబూ?

ఈ వర్కవుట్ల గోలేంటి బాబూ?

మన్మథుడు.. అక్కినేని నాగార్జున కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమా. ఇప్పటికీ ఆ సినిమా చూస్తే ట్రెండీగా అనిపిస్తుంది. అందులోని ఎంటర్టైన్మెంట్ టైమ్ లెస్ అనే చెప్పాలి. ఈ తరం ప్రేక్షకులు చూసినా దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాను తలుచుకుంటే నాగ్ అభిమానులకు ఒక పులకింత కలుగుతుంది. అలాంటి సినిమాకు ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ తీయాలన్న ఆలోచన ఆశ్చర్యకరమైందే. ఐతే ‘మన్మథుడు’తో అసోసియేట్ అయిన ఇంకెవ్వరూ సీక్వెల్‌కు పని చేయడం లేదు. ‘చి ల సౌ’తో సత్తా చాటిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తన తొలి సినిమా తరహాలోనే వేగంగా ఈ సినిమాను లాగించే ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్. ఐతే సినిమా మొదలైనప్పటి నుంచి దీని గురించి సోషల్ మీడియాలో అప్ డేట్లే అప్ డేట్లు ఉంటున్నాయి.

ముఖ్యంగా ఈ మధ్య బయటికి వచ్చిన ‘మన్మథుడు-2’ పిక్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నాగ్ ఈ వయసులో కూడా ఎంతో ఛార్మింగ్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. రకుల్ లాంటి యంగ్ హీరోయిన్ పక్కన నాగ్ ఎలా ఉంటాడో.. వీళ్లకు జోడీ కుదురుతుందా అని సందేహించిన వాళ్లు ఈ ఫొటోలు చూసి అభిప్రాయం మార్చుకుంటున్నారు. కాకపోతే ఈ మధ్య వరుసగా నాగ్, రకుల్‌ల వర్కవుట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కొంత విసిగిస్తోంది చిత్ర బృందం. యూరప్‌లో నాగ్ జిమ్‌లో, బయట చేసిన వర్కవుట్ల ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. రకుల్‌వి కూడా అలాంటి ఫొటోలు, వీడియోలు వదిలారు. వీళ్లిద్దరి ఫిట్నెస్ లెవెల్స్ గురించి ఒకటే ఊదరగొట్టేస్తున్నారు. ఐతే మామూలుగా ఫిట్నెస్ ప్రాధాన్యం గురించి చెప్పదలుచుకున్నారా లేక కథలో భాగంగా ఈ ఫిట్నెస్ సంగతులేమైనా చూపించబోతున్నారా అన్నది తెలియడం లేదు. కాకపోతే అదే పనిగా ఈ ఫొటోలు, వీడియోలు వదులుతుండటంతో జనాలకు కొంచెం విసుగొస్తోంది. ఆ మధ్య ‘సైజ్ జీరో’లో ఇలాగే క్లాసులు పీకితే జనాలు ఫ్రస్టేట్ అయి సినిమాను తిప్పికొట్టారు. అందులో నాగ్ కూడా భాగం అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ‘మన్మథుడు-2’లో ఇలాంటి క్లాసులేమీ లేకుండా చూసుకుంటే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English