ఇంతా కష్టపడి లాభాలు రాకుంటే..?

ఇంతా కష్టపడి లాభాలు రాకుంటే..?

జెర్సీ.. టాలీవుడ్ గర్వించదగ్గ సినిమాల్లో ఒకటి. ఇది మన సినిమా అని గర్వంగా వేరే వాళ్లకు చూపించుకోవచ్చు. స్పోర్ట్స్ డ్రామా జానర్లో తెలుగులో ఇదే బెస్ట్ ఫిలిం. మొత్తంగా ఇండియాలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ చిత్రమిది. ఒక సినిమా అనుభవం ఉన్న గౌతమ్ తిన్ననూరి.. ఎంతో నిజాయితీగా, ఒక కన్విక్షన్‌తో గొప్ప సినిమా తీశాడు. నాని కెరీర్లో మరే సినిమాకు పడనంత కష్టం పడ్డాడు ఈ సినిమా కోసం. మామూలు నటులు చేయదగ్గ పాత్ర కాదది. అర్జున్ పాత్రను అతను ఎంత గొప్పగా పోషించాడో మాటల్లో వర్ణించడం కష్టం. ఇక ఇలాంటి సినిమాను రాజీ లేకుండా నిర్మించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన అభిరుచిని చాటుకున్నాడు. మిగతా నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కూడా ఈ సినిమా కోసం సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు. అందరూ కలిసి ఒక మైలురాయి లాంటి సినిమాను అందించారు.

ఇంతమంది ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందించాల్సిన బాధ్యత అభిరుచి ఉన్న ప్రేక్షకుల మీద కూడా ఉంది. ఈ సినిమాకు చాలా మంచి సమీక్షలు వచ్చాయి. చూసిన వాళ్లందరూ సినిమా అద్భుతం అన్నారు. కానీ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. తొలి వారంలో వరల్డ్ వైడ్ ‘జెర్సీ’ రూ.21 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాకు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఇంకా మెరుగైన వసూళ్లు రావాలి. ఈ పాటికి బ్రేక్ ఈవెన్‌ మార్కును దాటేయాలి. కానీ ఇంకా ఈ చిత్రానికి రూ.6 కోట్లకు పైగా షేర్ వస్తే తప్ప బయ్యర్లు గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ ప్రభంజనం చూస్తుంటే రెండో వారంలో ‘జెర్సీ’ ఏమాత్రం షేర్ రాబడుతుందో అని సందేహాలు కలుగుతున్నాయి. అంతిమంగా ఎక్కడ ఆ సినిమా ‘హిట్’ కేటగిరిలోకి చేరకుండా బ్రేక్ ఈవెన్‌కు ముందే ఆగిపోతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. అదే జరిగితే.. ఇంత గొప్ప ప్రయత్నం చేసిన చిత్ర బృందం నిరాశకు గురికావడం గ్యారెంటీ. ఇలాంటి సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం వస్తే ఈ కోవలో మరిన్ని మంచి చిత్రాలు రావడానికి ఆస్కారముంటుంది. అలా జరగని పక్షంలో ఇలాంటి సాహసాలకు ఫిలిం మేకర్స్ వెరిసే ప్రమాదం ఉంది. మరి ప్రేక్షకులు ఈ సినిమాకు ఎలాంటి ఫలితం మిగులుస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English