కొంపదీసి ‘జైసింహా’ హిట్టనుకుంటున్నాడా?

కొంపదీసి ‘జైసింహా’ హిట్టనుకుంటున్నాడా?

నందమూరి బాలకృష్ణది విచిత్రమైన వ్యవహారం. ఆయన ఎప్పుడు ఎవరితో సినిమా ఓకే చేస్తాడో అర్థం కాదు. కొన్నిసార్లు ఆయన ఔట్ డేట్ అయిపోయిన డైరెక్టర్లతో ముతక సినిమాలు చేస్తుంటాడు. ఆ కోవలోనిదే గత ఏడాది వచ్చిన ‘జై సింహా’. ఈ సినిమా చూస్తుంటే 90ల నాటి రోజులు గుర్తుకొస్తాయి. ఈ తరహా రొటీన్ మాస్, సెంటిమెంట్ సినిమాలు అప్పుడే వచ్చేవి. ఇప్పుడు ట్రెండ్ ఎంతగా మారిపోయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతి సీజన్లో రిలీజవడం, పోటీగా వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సహా మిగతా చిత్రాలన్నీ డిజాస్టర్లు కావడంతో ‘జై సింహా’కు కలిసొచ్చింది. ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయి. అంత మాత్రాన అది మంచి సినిమా అని, హిట్టయిపోయిందని అనుకుంటే పొరబాటే. బాలయ్య ఇలాంటి ఫీలింగ్‌లోనే ఉన్నాడో ఏమో.. మరోసారి కె.ఎస్.రవికుమార్‌తో పని చేయడానికి రెడీ అయిపోయాడు.

‘జై సింహా’ తీసిన సి.కళ్యాణ్ నిర్మాణంలోనే బాలయ్య-రవికుమార్ కాంబినేషన్లో సినిమా రాబోతోందన్నది తాజా సమాచారం. ఐతే ‘యన్.టి.ఆర్’ సినిమాతో ఆల్రెడీ కుదేలైపోయి ఉన్నాడు బాలయ్య. ఇలాంటి సమయంలో రవికుమార్ లాంటి దర్శకుడితో సినిమా చేస్తే ఆయన తిరోగమనంలో పయనిస్తున్నట్లే. తమిళంలో ఒకప్పుడు తిరుగులేని స్థాయిలో ఉన్న రవికుమార్‌ను అక్కడి వాళ్లే పట్టించుకోవడం లేదు. మీడియం రేంజి హీరోలు కూడా ఆయనకు దొరకట్లేదు. అక్కడ దాదాపుగా ఆయన కెరీర్ ముగిసింది. ఇలాంటి టైంలో తెలుగు హీరోలకు గాలం వేస్తున్నాడు. చాలామందిని ట్రై చేస్తే అనుకోకుండా బాలయ్య దొరికాడు. ‘జై సింహా’ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఖాళీ అయిపోయాడు. ఇప్పటిదాకా మరో సినిమా లేదు. ఆయన పరిస్థితేంటో చూడకుండా.. ‘జైసింహా’ ఏ పరిస్థితుల్లో ఓ మాదిరిగా ఆడిందో అర్థం చేసుకోకుండా బాలయ్య మళ్లీ మరో ముతక సినిమా చేయడానికి రెడీ అయిపోవడం ఆశ్చర్యం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English