రజనీ మేకప్ మ్యాన్‌కు అవార్డివ్వాల్సిందే

రజనీ మేకప్ మ్యాన్‌కు అవార్డివ్వాల్సిందే

సూపర్ స్టార్ రజనీకాంత్ బయట ఎలా కనిపిస్తాడో తెలిసిందే. నిఖార్సయిన నలుపు వర్ణంలో ఉండే ఆయనకు తలపై జుట్టు ఉండదు. ముందు పూర్తిగా బట్టదల వచ్చేసింది. అది వెనుక వైపు కూడా కింది దాకా వెళ్తోంది. ఉన్న కాస్త జుట్టు కూడా తెల్లబడిపోయింది. ఇక ఓవరాల్ లుక్ చూసుకున్నా రజనీ చాలా సాధారణంగా కనిపిస్తాడు. బయట రజనీని చూస్తే ఈయన అసలు హీరోనా అనుకుంటాం. తాత పాత్రలు వేయడానికి సరిపోతాడని అనుకుంటాం. కానీ సినిమాల్లో కనిపించే రజనీని చూసి షాకైపోతుంటాం. లుక్ ఎంతలా మారిపోతుందంటే.. తెర మీద చూసేది వేరే వ్యక్తినేమో అనిపిస్తుంది. అంతలా మేకప్‌తో మాయ చేస్తారు. దేశంలో ఎందరో వయసు మళ్లిన హీరోలున్నారు. వాళ్లందరూ మేకప్‌తో మేనేజ్ చేస్తుంటారు. కానీ రజనీ లాంటి మేకోవర్ మాత్రం అసాధ్యం అనిపిస్తుందంతే. రజనీకి ఎవరు మేకప్ వేస్తారో ఏమో కానీ.. అతడికి ఆస్కార్ అవార్డు ఇచ్చేయొచ్చనిపిస్తుంది.

ఒక మనిషిని మేకప్ ద్వారా ఇంత ఆకర్షణీయంగా తయారు చేయడం రజనీ విషయంలోనే చూడొచ్చు. రజనీ గత సినిమా ‘పేట’లో ఆయన లుక్ ఎంత ఆకర్షణీయంగా ఉందో తెలిసిందే. ఒక్కసారిగా సూపర్ స్టార్ వయసు సగానికి సగం తగ్గిపోయింది. ఇంతకంటే బెస్ట్ లుక్ తీసుకురావడం అసాధ్యం అనుకున్నారు. కానీ మురుగదాస్ దర్శకత్వంలో రజనీ చేస్తున్న కొత్త సినిమా లుక్స్ చూశాక ఆ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆరంభం కాగా.. ఆన్ లొకేషన్ పిక్స్ కొన్ని బయటికి వచ్చాయి. అందులో రజనీ మామూలుగా లేడసలు. కెరీర్ బెస్ట్ లుక్ అనిపిస్తోంది. కేవలం విగ్గు పెట్టేసి.. ముఖానికి రంగు వేసేస్తే ఈ లుక్ వచ్చేయదు. దీని వెనుక ఎంతో శ్రమ, శ్రద్ధ ఉన్నాయని ఒప్పుకోవాల్సిందే. చాలా ఏళ్లుగా రజనీ పర్సనల్‌గా మేకప్ మ్యాన్‌ను మెయింటైన్ చేస్తున్నారు. ఆ వ్యక్తే రజనీని ఇంత ఆకర్షణీయంగా మారుస్తుంటాడు. రజనీ తాజా లుక్ చూస్తే ఆ వ్యక్తికి హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English