మహేష్ ఫ్యాన్స్‌ని టెన్షన్ పెడుతూనే ఉన్నాడు

మహేష్ ఫ్యాన్స్‌ని టెన్షన్ పెడుతూనే ఉన్నాడు

మహర్షి.. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా. హీరోగా అతడికిది 25వ చిత్రం. ఇది అనుకోకుండా చేసిన మామూలు సినిమా కాదు. దీని వెనుక చాలా ప్లానింగ్ జరిగింది. ఎప్పుడో మూడేళ్ల కిందట ఈ ప్రాజెక్టు ప్లాన్ చేసుకున్నాడు మహేష్. కొన్ని వివాదాలు, ఇతర కారణాల వల్ల ఇది ఆలస్యమైంది. ‘ఊపిరి’ తర్వాత దాదాపు రెండేళ్లకు పైగా కష్టపడి ఈ స్క్రిప్టు రెడీ చేశాడు వంశీ. ఎట్టకేలకు గత ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని మే 9న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా గురించి ఇటు వంశీ, అటు నిర్మాత దిల్ రాజు ముందు నుంచి ఒక రేంజిలో చెబుతున్నారు. రాజు అయితే.. మహేష్ కెరీర్లోనే ఇది ‘ది బెస్ట్’ కావచ్చని కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఎంత పెద్ద ప్రాజెక్టు చేపట్టినా ఆచితూచి ఖర్చు చేసే రాజు.. ‘మహర్షి’ మీద మాత్రం చాలా ఎక్కువే బడ్జెట్ పెట్టాడు. దీన్ని బట్టి ఆయన కాన్ఫిడెన్స్ అర్థం చేసుకోవచ్చు.

ఐతే మాటలతో, ఖర్చుతో ‘మహర్షి’కి ఎంత హైప్ తెచ్చే ప్రయత్నం చేసినా.. దర్శకుడు వంశీ పైడిపల్లి మీద మాత్రం మహేష్ అభిమానుల్లో అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఈ భయానికి వంశీ ట్రాక్ రికార్డే కారణం. వంశీ ప్రతిసారీ పెద్ద పెద్ద హీరోలతో హై ప్రొఫైల్ ప్రాజెక్టులే చేశాడు కానీ.. ఇప్పటిదాకా సొంత కథతో నిఖార్సయిన హిట్టు కొట్టిన దాఖలాలు లేవు. అతడి తొలి సినిమా ‘మున్నా’ ఫ్లాప్. రెండో సినిమా ‘బృందావనం’ చెప్పుకోదగ్గ సినిమా ఏమీ కాదు. ఒక ఫార్ములాలో లాగించేస్తే ఏదో ఒక మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. ‘ఎవడు’ బేసిక్ ప్లాట్ ఒక హాలీవుడ్ మూవీ స్ఫూర్తిగా రాసుకున్నది. మిగతా వ్యవహారమంతా రొటీన్. ‘ఊపిరి’ ఏమో ఓ ఫ్రెంచ్ మూవీకి అఫీషియల్ రీమేక్. మొత్తంగా చూస్తే వంశీ దర్శకుడిగా అంత మంచి రికార్డయితే లేదు. ‘మహర్షి’ స్థాయి సినిమాను డీల్ చేసే సత్తా అతడికి ఉందా అన్న సందేహాలు ముందు నుంచి ఉన్నాయి. దీని కథాకథనాల గురించి ముందు నుంచి ఓ రేంజిలో చెబుతున్నారు కానీ.. వంశీకి సొంత కథతో నిజంగా ఒక మైల్ స్టోన్ మూవీ చేసే సత్తా ఉందా అన్నది సందేహం. మరి మే 9న అతను ఏ మేరకు సత్తా చాటుతాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English