షాకింగ్ రూమర్.. విజయ్‌కి విలన్‌గా షారుఖ్?

షాకింగ్ రూమర్.. విజయ్‌కి విలన్‌గా షారుఖ్?

‘జీరో’తో జీరో అయిపోయాాడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ అందుకుంటాడనుకుంటే ఉన్న మార్కెట్ కూడా పోయింది. ఈ ఫలితంతో షారుఖ్ ఆత్మవిశ్వాసం బాగా దెబ్బ తినేసిందని సన్నిహితులు ఓపెన్‌గానే చెప్పుకున్నారు. ఈ డిప్రెషన్లో అతను రాకేశ్ శర్మ బయోపిక్ నుంచి కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఖాళీ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయిన షారుఖ్.. ‘జీరో’ విడుదలైన నాలుగు నెలలకు కూడా ఇంకా తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేయలేదు. ఐతే ఇక బాలీవుడ్ దర్శకులతో లాభం లేదని.. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో అతను తీసిన ‘మెర్శల్’ రీమేక్‌లో షారుఖ్ నటిస్తాడని ఆ మధ్య ఒక ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత తేలింది. కానీ ఇప్పుడు దీన్ని మించిన షాకింగ్ రూమర్ ఒకటి హల్ చల్ చేస్తోంది.

షారుఖ్ ఒక తమిళ చిత్రంలో నటిస్తాడట. అది కూడా విలన్‌గానట. ఈ విషయాన్ని ఫిలిం ఫేర్ వెబ్ సైట్ ప్రముఖంగా ప్రచురించడం విశేషం. ఆ చిత్రంలో హీరో మరెవరో కాదు.. ఇళయ దళపతి విజయ్. అతను అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రంలో షారుఖే విలన్ అంటూ వార్త ఇచ్చారు. ఈ మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లో షారుఖ్, అట్లీ పక్క పక్కన కనిపించడంతో వీరి కలయికలో సినిమా అనే రూమర్ మొదలైంది. అది ‘మెర్శల్’ హిందీ రీమేక్ అన్నారు. కానీ ఇప్పుడు విజయ్ హీరోగా అట్లీ తీస్తున్న కొత్త చిత్రంలో షారుఖ్ విలన్ అనేస్తున్నారు. మామూలుగా వింటే ఇదొక సిల్లీ రూమర్‌లాగే అనిపిస్తుంది కానీ.. ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్లలో ఈ వార్త హల్ చల్ చేస్తుండటంతో కొట్టిపారేయలేని పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంతో చూడాలి. ‘తెరి’, ‘మెర్శల్’ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత విజయ్-అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో షారుఖ్ విలన్ పాత్ర చేస్తే దానికొచ్చే క్రేజే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English