‘యన్.టి.ఆర్’ను ఇలా అయినా చూస్తారా?

‘యన్.టి.ఆర్’ను ఇలా అయినా చూస్తారా?

టాక్ సూపర్.. కలెక్షన్లు పూర్.. సంక్రాంతికి వచ్చిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ పరిస్థితి ఇది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తిరుగులేని స్థాయిని అందుకుని తెలుగు ప్రజల ఆరాధ్యుడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ మీద సినిమా తీస్తే జనాలు ఎగబడి చూస్తారనుకున్నారు. సావిత్రి మీద ‘మహానటి’ తీస్తే అంతగా ఆదరించిన జనం.. ఎన్టీఆర్‌పై సినిమా తీస్తే ఇంకెంతగా ఆదరిస్తారో అనుకున్నారు. కానీ డ్రామా లేకుండా ఫ్లాట్‌గా సాగిపోయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదురైంది. సంక్రాంతి సీజన్లో మంచి టాక్ తెచ్చుకుని కూడా ఈ చిత్రం నిలబడలేకపోయింది. భారీ నష్టాలతో తెలుగు సినీ చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ గురించి ఇంకెంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ చిత్రాన్ని తర్వాత అమేజాన్ ప్రైంలో రిలీజ్ చేస్తే అక్కడ కూడా స్పందన అంతంతమాత్రంగానే కనిపించింది. ఐతే థియేటర్లలో సినిమా చూడాలన్నా, అమేజాన్‌లో చూడాలన్నా డబ్బులు పెట్టుకోవాలి. ఇంటర్నెట్ ఉండాలి. ఇవేమీ లేకుండా ఇంట్లో కూర్చుని టీవీలో ఉచితంగా సినిమా చూసే అవకాశం వస్తే అయినా జనాలు ఈ సినిమా చూస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్న. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితం అందాక కూడా ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ బుల్లితెరపై ప్రిమియర్ షో గురించి గొప్పగా చెబుతూ ఒక ప్రోమో కట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఈ ఆదివారం సాయంత్రం జెమిని టీవీలో ఈ చిత్రం ప్రిమియర్ షోగా ప్రసారం కానుంది. మరి ఈ చిత్రానికి టీఆర్పీ రేటింగ్స్ ఎలా వస్తాయన్నది ఆసక్తికరం. అప్పటికి ఈ సినిమా అంతిమ ఫలితంపై ఒక అంచనాకు రావచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English