భాయ్.. ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడు

భాయ్.. ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడు

ప్రతి ఏడాదీ రంజాన్ పండక్కి ఏం ఉన్నా లేకపోయినా.. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా మాత్రం థియేటర్లలో ఉంటుంది. ఇది చాలా ఏళ్లుగా నడుస్తున్న ఆనవాయితీ. ప్రతిసారీ ఈద్‌‌కు సినిమా ఉండేలా భలేగా ప్లాన్ చేసుకుంటాడు సల్మాన్. ఐతే గత ఏడాది పండక్కి వచ్చిన అతడి సినిమా ‘రేస్-3’ అట్టర్ ఫ్లాప్ అయింది. దీనికి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. సినిమా పరంగా చెత్త కావడంతో తర్వాత నిలబడలేదు. సల్మాన్ గతంలోనూ ఇలాంటి మైండ్ లెస్ మాస్ మూవీస్ సినిమా చేశాడు కానీ.. ‘రేస్-3’ విషయంలో మరీ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో సల్మాన్ ఈసారి జాగ్రత్త పడ్డాడు. తనకు ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ‘భారత్’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకు సంబంధించి ఇంతకుముందు వచ్చిన టీజర్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేశారు. అది కూడా అదిరిపోయేలా ఉండటంతో సల్మాన్ ఈసారి ఈద్‌కు పెద్ద హిట్ ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు.

ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినపుడు పుట్టి తన తండ్రి ‘భారత్’ అనే పేరు పెట్టడంతో నరనరానా దేశభక్తి నింపుకున్న ఓ వ్యక్తి కథ ఇది. ‘ఎ జర్నీ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ నేషన్ టుగెదర్’ అనే ట్యాగ్ లైన్‌ను బట్టి సినిమాపై ఒక అంచనాకు రావచ్చు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక వ్యక్తి జీవితంలో వివిధ పరిణామాల్ని చూపించే సినిమా ఇది. సల్మాన్ పలు అవతారాల్లో కనిపిస్తున్నాడు. మొదట్లో అతడి జీవితంలో అన్నీ ఉంటాయి. అంతా సాఫీగా సాగుతోందనుకుంటున్న సమయంలో కష్టాలు మొదలవుతాయి.మరి వీటిని అతనెలా అధిగమించాడన్నదే ఈ కథ. ఆద్యంతం భారీతనం, అనేక మలుపులు ఉన్న సినిమాలా కనిపించింది ట్రైలర్ చూస్తే. కథా బలం ఉన్న సినిమాలాగే ఉంది ‘భారత్’. సల్మాన్ నిర్మాణ భాగస్వామిగా ఉన్న ఈ భారీ చిత్రం రంజాన్ కానుకగా జూన్ 5న ఈ చిత్రం ప్రేక్షకలు ముందుకొస్తుంది. మరి ఈసారి మంచి టాక్ వస్తే భాయ్ ఎలాంటి రికార్డులు నెలకొల్పుతాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English