కాంఛన సిరీస్.. పది సినిమాలు గ్యారెంటీ!

 కాంఛన సిరీస్.. పది సినిమాలు గ్యారెంటీ!

‘కాంఛన’ సిరీస్‌లో పది సినిమాలు తీసే ఆలోచన ఉన్నట్లు రాఘవ లారెన్స్ చెబితే చాలా మంది నవ్వుకున్నారు. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటిదాకా ఏ సిరీస్‌లోనూ అన్ని సినిమాలు రాలేదు. పైగా హార్రర్ కామెడీ అనేది మన దగ్గర పూర్తిగా ఔట్ డేట్ అయిపోయింది. ఇలాంటి జానర్లో పది సినిమాలంటే సిల్లీగా అనిపించింది. అసలు ముందు ఈ సిరీస్‌లో వస్తున్న నాలుగో సినిమా ‘కాంఛన-3’ ఆడి.. ఈ సిరీస్‌లో తర్వాతి సినిమా వస్తుందేమో చూద్దాం అనుకున్నారు.

గత శుక్రవారం విడుదలైన ‘కాంఛన-3’కి నెగెటివ్ టాక్ రావడంతో ఇది బాక్సాఫీస్ దగ్గర నిలబడ్డం కష్టమని.. బయ్యర్లకు నష్టాలు ఖాయమని.. దీంతో లారెన్స్ ఇక ఈ సిరీస్‌కు స్వస్తి చెప్పేయడం ఖాయమని అంతా అంచనా వేశారు. కానీ అనూహ్యంగా టాక్‌తో సంబంధం లేకుండా ‘కాంఛన-3’ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది.

అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ చిత్రానికి అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. రెండు భాషల్లో కలిపి తొలి వారాంతంలో రూ.40 కోట్ల గ్రాస్ అంటే మాటలు కాదు. తెలుగు రాష్ట్రాల వరకే షేర్ రూ.10 కోట్లకు చేరువగా ఉంది. ఈ సినిమాపై ఠాగూర్ మధు రూ.16 కోట్ల పెట్టుబడి పెడితే పెద్ద రిస్క్ చేశాడన్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే రికవరీ పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది.

ఒక డబ్బింగ్ సినిమా ఈ రోజుల్లో ఇంత మొత్తం రికవర్ చేయడం చిన్న విషయం కాదు. మాస్ సెంటర్లలో ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్లో హౌస్ ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. వీకెండ్ తర్వాత కూడా పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. సినిమా గురించి క్రిటిక్స్ ఏం కామెంట్లు చేసినా.. ఎలాంటి రివ్యూలిచ్చినా.. సోషల్ మీడియాలో ఉండే క్లాస్ జనాలంతా సినిమాను తిట్టిపోస్తున్నా.. మాస్ జనాలకు ఇదేమీ పట్టట్లేదు. సినిమాకు పట్టం కడుతున్నారు. ఎలాంటి కంటెంట్‌తో సినిమా తీసినా.. ఎంత రొటీన్‌గా లాగించినా టార్గెటెెడ్ ఆడియన్స్ ‘కాంఛన’ సిరీస్‌కు బ్రహ్మరథం పడుతుండటంతో లారెన్స్ ఈ సిరీస్‌లో పది సినిమాలు తీసినా తీసేస్తాడేమో అనిపిస్తోంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English