చిత్రలహరి లాస్ వెంచర్

చిత్రలహరి లాస్ వెంచర్

వరుసగా అరడజను ఫ్లాపులతో అల్లాడిపోయిన మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు ‘చిత్రలహరి’తో ఊరట లభించినట్లే కనిపించింది. అతను ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ‘చిత్రలహరి’ ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. తొలి వారాంతంలో వసూళ్లు టాక్‌కు మించేే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి తొలి మూడు రోజుల్లో రూ.9.2 కోట్ల షేర్ రావడం గొప్ప విషయమే. తేజు గత సినిమాలతో పోలిస్తే ఇవి చాలా మెరుగైన వసూళ్లే. గత ఏడాది తేజు నుంచి వచ్చిన ‘ఇంటిలిజెంట్’, ‘తేజ్ ఐ లవ్యూ’ చిత్రాలకు ఫుల్ రన్లో ఇందులో సగం వసూళ్లు కూడా రాలేదు.

తొలి వారాంతంలో జోరు చూస్తే ‘చిత్రలహరి’ బ్రేక్ ఈవెన్ దిశగానే అడుగులు వేస్తున్నట్లే కనిపించింది. అప్పటికే ఆ చిత్రం 60-70 శాతం మధ్య బయ్యర్ల పెట్టుబడిని రివకర్ చేసింది. ఐతే వీకెండ్ తర్వాత మాత్రం ‘చిత్రలహరి’ నిలబడలేకపోయింది. ముందు వారం వచ్చిన ‘మజిలీ’ నుంచి దీనికి పోటీ ఉండగా.. వీక్ డేస్‌లో ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించలేకపోయింది. దీనికి తోడు గత శుక్రవారం రిలీజైన ‘జెర్సీ’, ‘కాంఛన-3’ సినిమాలు ‘చిత్రలహరి’ బాక్సాఫీస్ రన్‌‌కు దాదాపుగా తెరదించేశాయనే చెప్పాలి.

‘జెర్సీ’ క్లాస్ సెంటర్లలో ప్రేక్షకుల్ని తన వైపు తిప్పేసుకుంటే.. ‘కాంఛన-3’ మాస్ సెంటర్లలో ‘చిత్రలహరి’ని దాదాపుగా తుడిచిపెట్టేసింది. ‘చిత్రలహరి’కి ఫస్ట్ వీకెండ్ తర్వాత ఇంకో నాలుగున్నర కోట్లకు పైనే షేర్ రావాల్సి ఉండగా.. రెండున్నర కోట్లకు మించి రాలేదని ట్రేడ్ వర్గాల అంచనా. అంటే బయ్యర్లకు దాదాపు రెండు కోట్ల నష్టమన్నమాట. రికవరీ 85 శాతం దగ్గర ఆగినట్లు తెలుస్తోంది. తేజు గత చిత్రాలతో పోలిస్తే టాక్, వసూళ్లు రెండూ బాగున్నప్పటికీ చివరికిది లాస్ వెంచర్‌గానే మిగిలింది. కాకపోతే నష్టం స్వల్పంగానే ఉండటం ఊరట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English