వివాదంలో రాఘవేంద్రుడి కొడుకు సినిమా

వివాదంలో రాఘవేంద్రుడి కొడుకు సినిమా

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఇప్పటిదాకా సినీ రంగంలో చేసిన ప్రయత్నాలన్నీ వృథానే. నటుడిగా మారి ‘నీతో’ అనే సినిమా చేస్తే అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘అనగనగా ఓ ధీరుడు’.. ‘సైజ్ జీరో’ సినిమాలు రూపొందించాడు. అవి కూడా దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. దీంతో రెండేళ్లకు పైగా ఖాళీగా ఉండిపోయాడు.

ఇప్పుడతను మళ్లీ దర్శకుడిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. దర్శకుడిగా ప్రకాష్ ట్రాక్ రికార్డును పట్టించుకోకుండా అతడితో బాలీవుడ్ ప్రముఖ తారలు సినిమా చేయడానికి ముందుకు రావడం విశేషం. నటులుగా గొప్ప పేరు సంపాదించి జాతీయ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి పురస్కారాలు పొందిన రాజ్ కుమార్ రావు.. కంగనా రనౌత్ ప్రకాష్ దర్శకత్వంలో నటిస్తుండటం విశేషం. ఆ సినిమా పేరు.. మెంటల్ హై క్యా.

ఈ సినిమాకు సంబంధించి మొదట్నుంచి ఆసక్తికర పోస్టర్లు వదులుతున్నారు. తాజాగా రాజ్ కుమార్, కంగనా తమ నాలుకలపై బ్లేడ్ పెట్టుకున్న ఒక పోస్టర్ ఆసక్తి రేకెత్తించింది. ఐతే ఈ సినిమా ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. దీనికి ‘మెంటల్ హై క్యా’ అనే టైటిల్ పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మానసిక వికలాంగుల్ని కించపరిచేలా టైటిల్‌ ఉందని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆరోపించింది. టైటిల్‌ మార్చాలని డిమాండ్‌ చేస్తూ.. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ)ని డిమాండ్‌ చేసింది. పలువురు నిపుణులు కూడా టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై నటి దీపికా పదుకొణె స్థాపించిన మానసిక వికలాంగుల ఫౌండేషన్‌ ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌’ కూడా స్పందించింది. సినిమాల్లో మానసిక వికలాంగుల పాత్రల్ని చూపించడం కూడా ఆపాలని.. అలాంటి వారి విషయంలో కాస్త సున్నితంగా, బాధ్యతగా ప్రవర్తించాలని ఆ సంస్థ పేర్కొంది. ఐతే ఈ అభ్యంతరాల్ని ‘మెంటల్ హై క్యా’ చిత్ర బృందం కొట్టిపారేసింది. కంగనపై ఎప్పుడు విమర్శలు వచ్చినా స్పందించే ఆమె చెల్లెలు రంగోలి విమర్శకులపై విరుచుకుపడింది. కంగనను దెబ్బ తీయడానికే ఇలా చేస్తున్నారని అంది. దీపిక ఆధ్వర్యంలో నడిచే ఫౌండేషన్‌ మీదా విమర్శలు గుప్పించింది. ‘మెంటల్‌ హై క్యా’ సినిమా చూసిన తర్వాత మీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా దీపికా పదుకొనేను తీసేసి కంగనను పెట్టుకోవాలనుకుంటారని ఆమె సెటైర్ వేయడం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English