‘సాహో’ సినిమా ఎట్టకేలకు...

‘సాహో’ సినిమా ఎట్టకేలకు...

‘బాహుబలి’ కోసం ఏకంగా ఐదేళ్లు కేటాయించాడు ప్రభాస్. ఆ సినిమా ఎంత గొప్ప పేరు, మార్కెట్ తెచ్చినా కూడా మరీ ఐదేళ్లు ఒక ప్రాజెక్టుకు కేటాయించడం అంటే ఆశ్చర్యమే. ఐతే దాని వల్ల మంచే జరిగింది కాబట్టి చింతించాల్సిన పని లేదు. ఐతే ‘బాహుబలి’ విషయంలో అభిమానుల్ని మరీ ఎక్కువగా నిరీక్షింపజేసిన ప్రభాస్.. తర్వాతి సినిమా విషయంలో అయినా కొంచెం వేగం చూపిస్తాడని అనుకున్నారు.

కానీ ‘బాహుబలి’తో వచ్చిన మార్కెట్ స్థాయిని నిలబెట్టుకునేలా ‘సాహో’ను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేసుకోవడంతో ఈసారి కూడా ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’ వచ్చిన రెండేళ్లకు కూడా ‘సాహో’ విడుదల కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 15కే సినిమాను షెడ్యూల్ చేశారు కానీ.. పక్కాగా ఆ రోజు సినిమా వస్తుందా రాదా అన్న సందేహాలు రాకపోలేదు.

చాలా రోజులుగా ‘సాహో’ షూటింగ్ గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో సందేహాలు కలుగుతున్నాయి. ఐతే ఈ సందేహాలకు తెరదించుతూ యూనిట్ నుంచి సమాచారం బయటికి వచ్చింది. 15 నెలల ముందు షూటింగ్ మొదలుపెట్టుకున్న ‘సాహో’ ఎట్టకేలకు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర చివరి షెడ్యూల్ నడుస్తోందట. ముంబయిలో ఈ షెడ్యూల్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌తో మొత్తం షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం. బ్యాలెన్స్ ప్యాచ్ వర్క్ కూడా అవగొట్టి కొన్ని రోజుల్లోనే గుమ్మడికాయ కొట్టేయబోతున్నట్లు తెలుస్తోంది.

యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తీశారు. వాటికే ఎక్కువ వర్కింగ్ డేస్ అయ్యాయి. అవి ముందుగా పూర్తి చేసి మిగతా వర్క్ తర్వాత పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి ప్రభాస్ బయటికి వచ్చి రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై ఫోకస్ పెడతాడట. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టి అనుకున్న ప్రకారమే ఆగస్టు 15న ‘సాహో’ను విడుదల  చేయనున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English