ఫిక్స‌యిపోవ‌చ్చు.. ఇది బ్లాక్‌బ‌స్ట‌రే

సౌత్‌లో మంచి విజ‌యం సాధించిన సినిమాల హ‌క్కులు తీసుకుని వాటికి మ‌రింత మెరుగులు దిద్ది బాలీవుడ్‌లో అందించ‌డం అక్క‌డి ఫిలిం మేక‌ర్స్ కొన్నేళ్లుగా ఎక్కువ‌గా చేస్తున్న ప‌ని. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం నుంచి ఇలా బోలెడ‌న్ని సినిమాలు గ‌త కొన్నేళ్ల‌లో బాలీవుడ్‌కు వెళ్లాయి. చాలా వ‌ర‌కు మంచి ఫ‌లితాన్నందుకున్నాయి. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మూవీని హిందీలో షాహిద్ క‌పూర్‌ను హీరోగా పెట్టి రీమేక్ చేస్తే అదెంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే.

ఇప్పుడు అదే హీరో.. మ‌రో తెలుగు క్లాసిక్ రీమేక్‌లో న‌టించాడు. ఆ చిత్ర‌మే జెర్సీ. ఈ మూవీ పేరు కూడా మార్చ‌కుండా హిందీలో తీశారు. ఒరిజిన‌ల్ తీసిన గౌత‌మ్ తిన్న‌నూరినే హిందీ వెర్ష‌న్‌ను కూడా డైరెక్ట్ చేశాడు. క్రికెట్ నేప‌థ్యంలో మంచి ఎమోష‌న్ ఉన్న సినిమా కావ‌డంతో హిందీ రీమేక్ అన్న‌పుడే ఇది అక్క‌డ కూడా మంచి విజ‌యం సాధించ‌డం గ్యారెంటీ అన్న అభిప్రాయం క‌లిగింది.

ఇప్పుడు జెర్సీ హిందీ ట్రైల‌ర్ చూశాక సినిమా మీద మ‌రింత గురి ఏర్ప‌డుతోంది. ఇది బ్లాక్‌బ‌స్ట‌ర్ కావ‌డం ప‌క్కా అని ట్రైల‌ర్ చూసిన ఎవ‌రైనా చెప్పేస్తారు. క‌థాక‌థ‌నాల ప‌రంగా పెద్ద‌గా మార్పులేమీ చేయ‌కుండా మ‌రింత రిచ్‌గా, క్లాస్‌గా ఈ సినిమా తీసిన‌ట్లున్నాడు గౌత‌మ్. షాహిద్.. అర్జున్ పాత్ర‌లో చాలా సులువుగా ఒదిగిపోయాడు. అత‌డి ప‌క్క‌న మృణాల్ ఠాకూర్ కూడా బాగుంది. ట్రైల‌ర్ చూస్తే తెలుగు వెర్ష‌న్లోంచి స‌న్నివేశాలు, డైలాగుల‌ను యాజిటీజ్ తీసుకున్న‌ట్లే ఉంది.

హిందీ వెర్ష‌న్‌కు సంబంధించి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లంటే షాహిద్-మృణాల్ మ‌ధ్య లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లే. ఫ్లాష్ బ్యాక్‌లో హీరో హీరోయిన్ల మ‌ధ్య రొమాన్స్‌ను తెలుగుతో పోలిస్తే కొంచెం ఘాటుగా, బాలీవుడ్ స్ట‌యిల్లో తీసిన‌ట్లున్నారు. అన్నీ బాగున్నాయి కానీ.. తెలుగు వెర్ష‌న్‌కు మేజ‌ర్ హైలైట్‌గా నిలిచిన అనిరుధ్ మ్యూజిక్ మిస్స‌యిన‌ట్లు అనిపిస్తుంది.

హిందీలో కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే అనిపించినా.. అనిరుధ్ ఇచ్చిన గూస్ బంప్స్ మాత్రం రావ‌ట్లేదు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు, నాగ‌వంశీ.. బాలీవుడ్ నిర్మాత‌ అమ‌న్ గిల్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబ‌రు 31న హిందీ జెర్సీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.