సునీల్ వంట చేస్తే.. గిన్నెలు కడిగేది త్రివిక్రమ్

సునీల్ వంట చేస్తే.. గిన్నెలు కడిగేది త్రివిక్రమ్

బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చే వారి కష్టాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడైనా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తమ టాలెంట్ ఏంటో అందరికీ తెలిసేలా చేసి, దర్శకులుగా మారుతున్నారు కుర్రాళ్లు. కానీ ఒకప్పుడు పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. ఇండస్ట్రీలోకి వచ్చి అసిసెంట్ డైరెక్టర్‌గా, రైటర్‌గా ఏళ్లకు ఏళ్లు పని చేస్తే తప్ప అవకాశాలు దక్కేవి కావు.

ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకప్పుడు ఇలా కష్టపడ్డవాడే. కమెడియన్‌గా తిరుగులేని స్థాయి అందుకుని, హీరోగా కూడా సినిమాలు చేసిన అతడి మిత్రుడు సునీల్‌ది కూడా ఇదే పరిస్థితి. వీళ్లిద్దరూ భీమవరం నుంచి వచ్చిన వాళ్లే. కాలేజీలో కలిసి చదువుకుని, ఇక్కడికొచ్చి ఒకే రూంలో ఉంటూ సినీ అవకాశాల కోసం కష్టపడ్డవాళ్లే. తామిద్దరం ఒకే గదిలో ఉన్నప్పటి రోజుల గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు చెప్పాడు సునీల్.

అప్పట్లో తమ రూంలో సునీల్ వంట చేస్తే త్రివిక్రమ్ గిన్నెలు కడిగేవాడట. త్రివిక్రమ్‌కు వంటలో అంతగా ప్రావీణ్యం లేకపోవడంతో ఎప్పుడూ సునీలే ఆ బాధ్యత తీసుకునేవాడట. ఐతే బట్టలు ఉతుక్కునే పని మాత్రం కలిసి చేసుకునేవాళ్లమని సునీల్ తెలిపాడు. తనకు నాన్ వెజ్ లేకుంటే ముద్ద దిగేది కాదని.. త్రివిక్రమ్ శాకాహారి అని.. అయినే కలిసే ఉండేవాళ్లమని.. త్రివిక్రమ్ రైటర్‌గా పని చేసేటపుడు హోటల్లో రూం ఇచ్చేవాళ్లని.. తాను అక్కడికి వెళ్లి తన పేరు మీద బిరియానీ తినేవాడినని.. తాను రూంలో వంట చేసి పెడితే అతనొచ్చి తిని వెళ్లేవాడని సునీల్ వెల్లడించాడు.

అప్పట్లో తామిద్దరం ఒకే సైజులో ఉండేవాళ్లమని.. దీంతో బట్టల విషయంలో నీది నాది అని తేడా ఏమీ ఉండేది కాదని ఒకరి బట్టలు ఒకరు వేసుకుని వెళ్లిపోయేవాళ్లమని సునీల్ తెలిపాడు. అప్పట్లో పంజాగుట్టలో తామిద్దరం కలిసి ఉన్న గది తాలూకు జ్ఞాపకాల్ని వదులుకోలేక ఆ గదికి ఇప్పటికీ త్రివిక్రమ్, సునీల్ అద్దె చెల్లిస్తూ తమ అధీనంలోనే ఉంచుకోవడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English