అనిరుధ్ ఏంటో ఇప్పుడు చూసుకోండి

అనిరుధ్ ఏంటో ఇప్పుడు చూసుకోండి

అనిరుధ్ రవిచందర్.. తమిళంలో పెద్ద మ్యూజికల్ సెన్సేషన్. తొలి సినిమా ‘3’తోనే అతనేంటో అందరికీ తెలిసిందే. 17 ఏళ్ల వయసులో సంగీత దర్శకుడిగా మారి కొలవెరి పాటతో అతను సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇదేదో ఫ్లూక్ హిట్ అయిపోయిందనుకున్న వాళ్లు కూడా తర్వాత అతడి సినిమాల్లో పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌కు ఫిదా అయిపోయారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అదిరిపోయే ఔట్ పుట్ ఇవ్వడం అనిరుధ్‌ ప్రత్యేకత.

ఇటు పాటలు, అటు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఎన్నో సినిమాలు అనిరుధ్ ప్రత్యేకతను చాటుకున్నాయి. తమిళంలో చాలా తక్కువ కాలంలో అగ్ర సంగీత దర్శకుడిగా ఎదిగిన అనిరుధ్‌కు తెలుగులో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ‘అజ్ఞాతవాసి’ లాంటి భారీ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అతడికి.. ఆ సినిమా డిజాస్టర్ అయి తీవ్ర నిరాశకు గురి చేసింది.

నిజానికి అనిరుధ్ తన వరకు మంచి ఔట్ పుట్ ఇచ్చినా.. సినిమా పోవడంతో ఆ ఫెయిల్యూర్ క్రెడిట్లో అతడికీ భాగం ఇచ్చేశారు. ఐరెన్ లెగ్ ముద్ర కూడా వేసేశారు. ‘అరవింద సమేత’ నుంచి అతడిని తప్పించేయడం కూడా తెలిసిందే. అలాగని తెలుగులో ఇంకో సినిమా చేయకుండా అనిరుధ్ సైలెంట్ అయిపోయి ఉంటే.. అతడిపై ఫెయిల్యూర్ ముద్ర పడిపోయేది.

ఈసారి భారీ ప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా ‘జెర్సీ’ లాంటి మీడియం రేంజ్ సినిమాను ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి తనదైన శైలిలో మ్యూజిక్ ఇచ్చి తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఈ సినిమాలో పాటలు బాగానే అనిపించినప్పటికీ.. మరీ ప్రత్యేకంగా లేవన్న అభిప్రాయం వినిపించింది. ఐతే సినిమా చూశాక ఆ అభిప్రాయం మార్చుకుంటున్నారు.

అనిరుధ్ ఏదో ధూమ్ ధామ్ పాటలు ఇవ్వాలని ప్రయత్నించలేదు. కథకు తగ్గట్లుగా పాటలు ఇచ్చాడు. సినిమా చూస్తుంటే పాటలు ఎక్కడా ప్రత్యేకంగా అనిపించవు. సినిమాలో అలా కలిసిపోయాయి. ఇక బ్యాగౌండ్ స్కోర్ గురించి చెప్పేదేముంది? సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే ఔట్ పుట్ ఇచ్చాడు. క్రికెట్ మ్యాచ్‌‌ల దృశ్యాలు, ఎమోషనల్ సీన్లు ఆర్ఆర్‌తో ఎలివేట్ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.

మొత్తంగా ‘జెర్సీ’కి సంబంధించి దర్శకుడు, హీరో తర్వాత మేజర్ క్రెడిట్ అనిరుధ్‌కే ఇవ్వాలనడంలో సందేహం లేదు. ‘అజ్ఞాతవాసి’ రిజల్ట్ తర్వాత అనిరుధ్ టాలెంట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవాళ్లు ఇప్పుడు ‘జెర్సీ’ చూసి లెంపలేసుకోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English