జెర్సీలో ఆ రెండు సరిగా ఉండుంటేనా..

 జెర్సీలో ఆ రెండు సరిగా ఉండుంటేనా..

శుక్రవారం విడుదలైన ‘జెర్సీ’కి అదిరిపోయే టాక్ వచ్చింది. ఓవైపు సమీక్షకుల టాప్ రేటింగ్స్.. మరోవైపు ప్రేక్షకుల అద్భుత స్పందనతో ఈ చిత్రం చాలా పెద్ద రేంజికి వెళ్లేలా కనిపిస్తోంది. తెలుగులో వచ్చిన స్పోర్ట్స్ డ్రామాల్లో ఇదే ది బెస్ట్ అనడంలో మరో మాట లేదు. ఇంత అథెంటిగ్గా ఎవ్వరూ స్పోర్ట్స్ సినిమా తీసింది లేదు. నిజానికి క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో క్రికెట్‌కు మించి చాలా ఉంది. గాఢమైన ఎమోషన్లతో ప్రేక్షకుల్ని కదిలించే దృశ్యాలు చాలానే ఉన్నాయి.

ఇక క్రికెట్ పరంగా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. ఐతే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దాదాపుగా పర్ఫెక్ట్ సినిమా తీయడానికే ప్రయత్నించాడు కానీ.. రెండు విషయాల్లో మాత్రం కాస్త నిరాశ పరిచాడు. ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడి ఉంటే.. ‘జెర్సీ’ ఒక మైలురాయిగా నిలిచేది. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ డ్రామాల్లో ఒకటిగా నిలిచేది.

‘జెర్సీ’లో హీరో పదేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండి.. 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇస్తాడు. కానీ జట్టులోకి రావడానికి అతడికి పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. అక్కడైనా అతడిని కొంచెం వెనక్కి లాగడానికి ప్రయత్నించారు కానీ.. ఇక మైదానంలోకి అడుగు పెట్టాక హీరో మామూలుగా దూసుకెళ్లడు. పదేళ్లు క్రికెట్ బ్యాటే పట్టనివాడు.. నేరుగా వచ్చి రంజీ ట్రోఫీలో దుమ్ముదులిపేస్తాడు. అతడికసలు ఎదురన్నదే ఉండదు. మామూలు సినిమాల్లో అయితే ఇది ఓకే అనుకోవచ్చు కానీ.. ముందు నుంచి ఒక రియలిస్టిక్ స్పోర్ట్స్ డ్రామాలా సినిమాను తెరకెక్కించి.. ప్రేక్షకుల్ని కూడా ఆ దిశగా ప్రిపేర్ చేసి.. ముగింపు విషయంలోనూ బోల్డ్‌గా ఆలోచించిన గౌతమ్.. అర్జున్ ఆటను చూపించేటపుడు మాత్రం సగటు తెలుగు హీరో పూనినట్లుగా ప్రొజెక్ట్ చేశాడు.

సినిమాలో ఉన్న మరో లోపం.. రంజీ మ్యాచ్‌లను వాస్తవానికి దగ్గరగా చూపించకపోవడం. మామూలుగా రంజీ మ్యాచ్‌లు డేలోనే జరుగుతాయి. డై‌నైట్‌లో నిర్వహించరు. డేనైట్ టెస్టులపై ప్రయోగాలు జరుగుతున్న ఈ రోజుల్లో కూడా ఇంకా రంజీలు డేనైట్‌లో నిర్వహించట్లేదు. ఇక 90ల సంగతి చెప్పేదేముంది? మన దేశంలో క్రికెట్ సెటప్ మీద ఎంతో అధ్యయనం చేశాకే గౌతమ్ ఈ సినిమా తీసిన సంగతి స్పష్టంగా తెలుస్తుంటుంది. కానీ ఈ విషయం అతడికెందుకు తెలియలేదే. ఇక బడ్జెట్ పరిమితుల వల్లో ఏమో.. చాలా మ్యాచ్‌లకు స్టేడియం అట్మాస్ఫియర్ ఉండేలా చూసుకోలేదు. ఎక్కువగా క్లోజప్ షాట్లతో నైట్ ఎఫెక్ట్‌లో లాగించేయడం వల్ల ఏదో లోకల్ మ్యాచ్‌లు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందే తప్ప.. రంజీ స్థాయి కనిపించదు. ఈ లోపాల్ని నివారించి ఉంటే ‘జెర్సీ’ రేంజ్ ఇంకా ఎక్కడో ఉండేదనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English