ఆ మెగా ప్రాజెక్టులో అనుష్క?

ఆ మెగా ప్రాజెక్టులో అనుష్క?

‘బాహుబలి’ భారీ సినిమాలో నటించి గొప్ప పేరు సంపాదించినప్పటికీ.. సీనియర్ హీరోయిన్ అనుష్క కెరీర్లో అంత ఊపేమీ లేదు. దాని తర్వాత ‘భాగమతి’ ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు ‘సైలెన్స్’ అనే ప్రయోగాత్మక చిత్రం చేస్తోంది అనుష్క. దీనిపై పెద్దగా అంచనాలేమీ లేవు. ఐతే ఇప్పుడు అనుష్క ఓ మెగా ప్రాజెక్టులో భాగం కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్’లో ఆమె కీలక పాత్ర చేయనుందట.

నయనతార చేయాల్సిన పాత్రకు అనుష్కను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఒక దశలో నయనతారే సినిమాకు ఖరారైనప్పటికీ.. ఈ సినిమా ఆలస్యం అవుతుండటంతో వేరే పెద్ద ప్రాజెక్టులకు నయతార సంతకం చేసింది. ఇప్పుడు ‘పొన్నియన్ సెల్వన్’కు డేట్లు సర్దుబాటు చేయలేక తప్పుకోగా ఆమె బదులు అనుష్కను ఎంచుకున్నారట.

విశేషం ఏంటంటే ముందుగా ‘పొన్నియన్ సెల్వన్’ కోసం చాలా ఏళ్ల కిందటే అనుష్కను సంప్రదించారు. అప్పట్లో నాగార్జున, మహేష్ బాబు, విజయ్‌ల కలయికలో ఈ సినిమా చేయాలని మణిరత్నం అనుకున్నాడు. అప్పుడు అనుష్క కూడా లైన్లో ఉంది. కానీ అప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మధ్యలో వేరే సినిమాలు చేసినప్పటికీ మణిరత్నం మనసు ‘పొన్నియన్ సెల్వన్’ దగ్గరే ఉంది. అదే పేరుతో రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని మణిరత్నం భావిస్తున్నాడు.

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, విజయ్‌ సేతుపతి, జయం రవి, కీర్తి సురేశ్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషించనున్నారట. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఎ.ఆర్‌. రెహమాన్‌ బాణీలు సమకూర్చబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English