నానీ.. ఎప్పుడు ఆగుతావు.. ఎక్కడ ఆగుతావు?

నానీ.. ఎప్పుడు ఆగుతావు.. ఎక్కడ ఆగుతావు?

నాని ఎంత మంచి నటుడో తొలి సినిమా ‘అష్టా చెమ్మా’లోనే తెలిసిపోయింది. ఫిలిం బ్యాగ్రౌండ్ ఏమీ లేని ఒక కొత్త నటుడు తొలి చిత్రంలోనే అంత బాగా నటించడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇక అప్పట్నుంచి ప్రతి సినిమాలోనూ నాని తన నటనతో ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒక సినిమా చూడటం.. ఇదే నాని కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అనుకోవడం.. అతను తర్వాతి సినిమాలో ఇంకా బాగా నటించి ముందున్న అభిప్రాయాన్ని మార్చేయడం.. కొన్నేళ్లుగా ఇలాగే సాగుతోంది వరస. చివరగా ‘నిన్నుకోరి’ చూసినపుడు నాని కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అనుకున్నారందరూ. ఐతే ‘ఎంసీఏ’ లాంటి కమర్షియల్ సినిమాలో.. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాస్’ లాంటి ఫ్లాపుల్లో కూడా నాని తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడిక ‘జెర్సీ’తో తన పాత పెర్ఫామెన్స్‌‌లు అన్నింటినీ అధిగమించేశాడు నేచురల్ స్టార్.

అర్జున్ పాత్రలో నాని తప్ప ఎవ్వరూ ఇంత బాగా చేసి ఉండరేమో అనిపించేలా సాగింది అతడి నటన. చాలా చోట్ల అతడి పరిణతి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ఈ చిత్రంలో నాని పాత్రకు డైలాగులు చాలా తక్కువ. కానీ అతడి లోపల తీవ్రమైన మానసిక సంఘర్షణ ఉంటుంది. దాని గురించి చివరికి కానీ తెలియదు. ఐతే భావోద్వేగాల్ని అణుచుకుంటూనే బాధను మాత్రమే వ్యక్తం చేసే పాత్రలో నాని సటిల్ యాక్టింగ్‌కి సలాం కొట్టకుండా ఉండలేం. కొన్ని సన్నివేశాల్లో అతడి నటనకు కన్నీళ్లు పెట్టేసుకుంటాం. మళ్లీ రంజీ జట్టులో చోటు దక్కినపుడు అతడి హావభావాలకు ముగ్ధులైపోతాం.

అతడి ఉద్వేగాన్ని మనమూ అనుభవిస్తాం. ఇక మేమో క్రికెట్టో తేల్చుకో అని భార్య అన్నపుడు.. కొడుక్కి జెర్సీ కూడా కొనలేని తన నిస్సహాయతను పలు సందర్భాల్లో చూపించేటపుడు నాని నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. మొత్తంగా మరోసారి తన పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకుల్ని హృదయాల్ని టచ్ చేసేశాడు నాని. ఇలా ప్రతిసారీ నాని నటనకు ఆశ్చర్యపోతూ.. అతను ఎక్కడ ఆగుతాడు.. ఎప్పుడు ఆగుతాడు అని ఆశ్చర్యపోతున్నారు జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English