నేచురల్ స్టార్ బిరుదు.. ఇష్టమే

నేచురల్ స్టార్ బిరుదు.. ఇష్టమే

తెలుగు సినీ పరిశ్రమలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి ఎదిగి స్టార్ ఇమేజ్ సంపాదించిన అతి కొద్ది మంది నటుల్లో నాని ఒకడు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా ముందు వరకు అతను చిన్న స్థాయి హీరోనే. కానీ ఆ సినిమా అనూహ్య విజయం సాధించి అతడికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. విశేషం ఏంటంటే.. ఈ సినిమా రిలీజ్ కాకముందే నాని ‘నేచురల్ స్టార్’ అయిపోయాడు. ఆ సినిమా టైటిల్స్‌తో నాని పేరు ముందు ‘నేచురల్ స్టార్’ అనే వేశారు. ఐతే అప్పటికది తమాషాలాగా అనిపించింది. కానీ ఆ సినిమా సాధించిన విజయంతో జనాలు నిజంగానే నానిని స్టార్‌గా గుర్తించడం మొదలుపెట్టారు. సీరియస్‌గా అతడిని ‘నేచురల్ స్టార్’ అని పిలవడం మొదలుపెట్టారు. ఐతే మొదట్లో ఈ బిరుదు విషయంలో కొంచెం సిగ్గుపడ్డ నాని.. ఇప్పుడు ఆ బిరుదు తనకు ఇష్టమే అని అంటున్నాడు.

అభిమానులు మిమ్మల్ని నేచురల్ స్టార్ అనడం మీద మీ స్పందనేంటి అని నానిని అడిగితే.. ‘‘ఇంట్లో నాకు నవీన్ అని పేరు పెట్టారు. మా అమ్మ ముద్దుగా నన్ను నాని అని పిలుచుకుంది. ప్రేక్షకులేమో నేచురల్ స్టార్ అన్నారు. మొదట్లో ఇదెందుకు అనుకునేవాడిని. కానీ వాళ్లు ప్రేమతో అలా పిలుస్తున్నపుడు ఎంతో సంతృప్తిగా అనిపిస్తోంది. ఇప్పుడు అది నాకు ఇష్టంగానే అనిపిస్తోంది’’ అని చెప్పాడు నాని. ఇంతకీ స్టార్ డమ్‌ను నమ్ముతారా అని అడిగితే.. నమ్ముతానని అన్న నాిని.. దాని గురించి ఇప్పుడు వినిపిస్తున్న అర్థాలపై మాత్రం తనకు నమ్మకం లేదన్నాడు.

కంటెంట్ వల్లే ఎవరికైనా స్టార్ డమ్ వస్తుందని చెప్పడం ద్వారా తాను అలా స్టార్ అయినవాడినే అని చెప్పకనే చెప్పాడు నాని. తనకు వరుసగా పరాజయాలు వచ్చి.. రెండేళ్ల పాటు సినిమానే రిలీజ్ కాని సమయంలో కూడా తాను ఒత్తిడికి గురి కాలేదని.. అలాంటిది గత ఏడాది వచ్చిన సినిమాలు ఫెయిలవడంపై ఇంకేం ఒత్తిడి ఉంటుందని నాని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English