షాకింగ్.. తమిళంలో బ్రహ్మోత్సవం రీమేక్!

షాకింగ్.. తమిళంలో బ్రహ్మోత్సవం రీమేక్!

కొన్నేళ్ల కిందట ‘బ్రహ్మోత్సవం’ అనే సినిమా మొదలైపుడు అది ఒక మోడర్న్ క్లాసిక్ అవుతుందన్న అంచనాలు కలిగాయి. అప్పటికే మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి మంచి సినిమాను అందించిన శ్రీకాంత్ అడ్డాల.. మరోసారి సూపర్ స్టార్‌తో జత కట్టడం.. ‘బ్రహ్మోత్సవం’ లాంటి మంచి టైటిల్ పెట్టడం.. పీవీపీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్‌కు ముందు కూడా మంచి బజ్ ఉంది. కానీ రిలీజ్ తర్వాత ఏమైందో తెలిసిందే. దారుణమైన డిజాస్టర్ అయిన ఈ చిత్రం మహేష్ కెరీర్‌కే ఒక మచ్చలా మిగిలిపోయింది. మహేష్ కెరీర్లో డిజాస్టర్లు కొత్త కాదు కానీ.. ‘బ్రహ్మోత్సవం’ మరీ పేథటిగ్గా ఉండి మహేష్ ఇలాంటి సినిమా ఎలా చేశాడా అన్న ప్రశ్న రేకెత్తించింది.

ఐతే టీవీల్లో వచ్చినా జనాలు చూడని ఈ సినిమాను ఇప్పుడు తమిళంలోకి రీమేక్ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు చేరన్ ‘బ్రహ్మోత్సవం’ను రీమేక్ చేయనున్నాడట. స్వయంగా ఓ ఇంటర్వ్యూలో అతనే ఈ విషయాన్ని వెల్లడించాడు. తనకు ‘బ్రహ్మోత్సవం’ కథ ఎంతో నచ్చిందని.. తమిళ నేటివిటీకి కనెక్టయ్యే కథాంశం ఇందులో ఉందని చేరన్ చెప్పడం విశేషం. ఆల్రెడీ ‘బ్రహ్మోత్సవం’ రీమేక్‌కు సన్నాహాలు మొదలయ్యాయని.. తమిళ నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేసే ప్రయత్నంలో ఉన్నామని కూడా చేరన్ తెలిపాడు. ‘ఆటోగ్రాఫ్’ సహా కొన్ని అద్భుతమైన చిత్రాలు అందించిన చేరన్.. కొన్నేళ్లుగా లైమ్ లైట్లో లేడు. ఇప్పుడొచ్చి ‘బ్రహ్మోత్సవం’ లాంటి ఆల్ టైం డిజాస్టర్‌ను రీమేక్ చేస్తానంటుంటే తమిళ జనాలకు సైతం ఫ్యూజులు ఎగిరిపోయే పరిస్థితి నెలకొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English