ఏపీ బీజేపీని మ‌లుపు తిప్పింది ఆయ‌నేనా..?

ఏపీ బీజేపీని మ‌లుపు తిప్పింది ఆయనేనా? ఆయ‌న సూచ‌న‌ల‌తోనే ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలోనూ.. రైతులు చేప‌ట్టిన ఉద్య‌మం విష‌యంలోనూ.. నాయ‌కుల మ‌ధ్య పొంతన లేకుండా పోయింది.

ముఖ్యంగా గ‌తంలో రాష్ట్ర‌ పార్టీ సార‌ధిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌ధాని రైతుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే.. అదే స‌మ‌యంలో టాఠ్‌! ఇలా ఎలా ప్ర‌క‌టిస్తారు… కేంద్రం వైఖ‌రి భిన్నంగా ఉంది.. రాష్ట్ర రాజ‌ధాని అంశం.. రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌రిధిలోది.. కాబ‌ట్టి మాకు, రాజ‌ధానికి సంబంధంలేదు.. అని కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు.. స‌హా ముర‌ళీ దేవ్‌ధ‌ర్ వంటివారు హాట్ కామెంట్లు చేశారు.

అయితే.. రైతుల‌కు న్యాయం చేయాల‌ని మాత్రం ప్ర‌బుత్వంపై ఒత్తిడి తెస్తామ‌ని.. ఈ నేత‌లు ప్ర‌క‌టించారు.ఇక‌, త‌ర్వాత‌.. రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడిగా.. బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌.. సోము వీర్రాజు కూడా.. ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. తాము రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఉంటామ ని.. కానీ, అమ‌రావ‌తికి కాద‌ని.. అన్నారు. రాజ‌ధాని విష‌యం రాష్ట్రం చూసుకుంటుంద‌ని.. చెప్పారు. అయితే.. ఒక్క పురందే శ్వ‌రి, కామినేని శ్రీనివాస్ వంటివారు మాత్రం చూచాయ‌గా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా నిలిచారు.

కానీ, ఎప్ప‌టిక‌ప్పుడు నాయ‌కులు మాత్రం రాజ‌ధాని విష‌యంలో త‌ప్పించుకునే ధోర‌ణినే అవ‌లంభించారు. దీంతో రాజ‌ధాని రైతుల నుంచి కూడా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. కానీ, ఇదే పార్టీకి చెందిన సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్ వంటివారు మాత్రం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అనేక కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొన్నారు. ఆర్థిక సాయం కూడా అందించారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏపీ బీజేపీ నేత‌లు.. ఒక్క‌పెట్టున రైతులు చేస్తున్న మ‌హాపాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు తెలిపారు. పాద‌యాత్ర ప్రారంభించిన 20 రోజుల త‌ర్వాత‌.. ఆదివారం.. నెల్లూరులో నాయ‌కులు సంఘీభావం తెలిపారు. వీరిలో పైన చెప్పుకొన్న నాయ‌కులు అంద‌రూ ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలా ఎందుకు ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్నారు… అంటే.. నెల్లూరుకు చెందిన కీల‌క నాయ‌కుడు.. ప్ర‌స్తుతం ఓ ప్ర‌ధాన ప‌ద‌విలో ఉన్న నాయ‌కుడు.. చేసిన సూచ‌న‌లేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదే విష‌యం బీజేపీలోనూ న‌లుగుతుండ‌డం గ‌మ‌నార్హం. “అయిందేదో అయిపోయింది. రాజ‌ధాని సెంటిమెంటు పెరుగోంది. మీరు(బీజేపీ) ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వ‌క‌పోతే.. క‌ష్టం” అని స‌ద‌రు పెద్దాయ‌న ఎక్క‌డ కీ ఇవ్వాలో అక్క‌డ ఇచ్చార‌ట‌. దీంతో బీజేపీ అగ్ర‌నేత ఇటీవ‌ల రాష్ట్ర నేత‌ల‌కు త‌లంటారు. వెంట‌నే పాద‌యాత్ర‌లో పాల్గొనాల‌ని హుకుం జారీ చేశార‌ట‌.

దీంతో ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయ‌కులు క్యూ క‌ట్టుకుని రాజ‌ధాని యాత్ర‌కు వెళ్లారు. రైతుల ప‌రంగా.. రాజ‌ధాని ప‌రంగా చూసుకున్న‌ప్పుడు.. ఇది ఆహ్వానించాల్సిన ప‌రిణామ‌మే. అయితే.. నిజానికి కేంద్రంలోని బీజేపీ దీనిని ఎలాచూస్తుంది ? రేపు రైతుల‌కు ఎలాంటి భ‌రోసా ఇస్తుంది? రాజ‌దాని రాష్ట్ర‌ప‌రిధిలోద‌ని చెప్పిన కేంద్రం ఇప్పుడు రైతుల‌కు మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా ఎలాంటి సంకేతాలు పంపుతోంది? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.