‘నేను సునీల్‌ టైపు కాదు’ అని చెబుతున్నాడా?

‘నేను సునీల్‌ టైపు కాదు’ అని చెబుతున్నాడా?

కమెడియన్‌గా కెరీర్ బ్రహ్మాండంగా సాగిపోతున్న రోజుల్లో హీరో అవతారం ఎత్తాడు సునీల్. ఐతే మొదట్లో అతను కథానాయకుడిగా నటించిన ‘అందాల రాముడు’.. ‘మర్యాదరామన్న’ లాంటి సినిమాల్లో అంతగా హీరోయిజం ఏమీ ఉండదు. కామెడీ టచ్ ఉన్న ఆ పాత్రలతో సునీల్ బాగానే మెప్పించాడు. ప్రేక్షకుల ఆదరణ పొందాడు. కానీ ఆ తర్వాత అతను ట్రాక్ తప్పాడు.

రెగ్యులర్ హీరోలు చేసేదే అతనూ చేశాడు. హీరోయిజం కోసం ట్రై చేశాడు. ఫైట్లు, డ్యాన్సులంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. జనాలకు చిరాకొచ్చింది. ఇక అతడి సినిమాల ఫలితాలు ఏమయ్యాయో అందరికీ తెలిసిందే. సునీల్ తర్వాత హీరోలుగా మారిన కమెడియన్లు కొందరు ఇలాంటి తప్పులే చేశారు. సప్తగిరి, షకలక శంకర్ లాంటి వాళ్లు ఫైట్లు, డ్యాన్సులతో ప్రేక్షకులకు షాకులిచ్చారు. వాళ్లకూ షాకులు తగిలాయి.

కమెడియన్‌గా కెరీర్ బాగా సాగిపోతున్న సమయంలో సప్తగిరి హీరో వేషాలకు మారిపోయి.. చాలా వరకు వాటికే పరిమితం అయిపోయాడు. హీరోగా అతడి తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ పవన్ కళ్యాణ్ అభిమానుల మద్దతు వల్ల ఓ మాదిరిగా ఆడింది కానీ.. తర్వాత అతడి నుంచి వచ్చిన ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ తుస్సుమనిపించింది. అయినా అతను తగ్గట్లేదు. ఇప్పుడు ‘వజ్రకవచధర గోవిందా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. దీని టీజర్లో కొంచెం కామెడీ కనిపించింది. కొంచెం హీరోయిజమూ కనిపించింది. ఐతే ఇందులో హీరోయిజం అందరూ అనుకుంటున్నట్లుగా ఉండదని అంటున్నాడు సప్తగిరి.

ఈ సినిమాలో తాను హీరోగా కనిపించకూడదని.. కమెడియన్ లాగే ఉండాలని.. షూటింగుకి కూడా అదే మైండ్‌సెట్‌తో రావాలని దర్శకుడు, రచయిత చెప్పారని.. ఆ మాటల్ని తూచా తప్పకుండా పాటించానని సప్తగిరి వెల్లడించాడు. తాను సినిమాలో హీరో అనుకోవడం లేదని కూడా చెప్పాడు. ఈ మాటల్ని బట్టి చూస్తుంటే తాను సునీల్ టైపు కాదని.. కామెడీ టచ్ ఉన్న హీరోగానే కొనసాగుతానని సప్తగిరి చెప్పకనే చెబుతున్నట్లుంది. మరి ‘వజ్రకవచధర గోవింద’తో అతను ఏమేరకు మెప్పిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English