జూన్ 7.. ఆర్ఎక్స్ 100 హీరో రీబర్త్

జూన్ 7.. ఆర్ఎక్స్ 100 హీరో రీబర్త్

కొన్నేళ్ల కిందట ‘ప్రేమతో కార్తీక్’ అనే సినిమా ఒకటి రిలైజైంది. ఐతే అలాంటి సినిమా ఒకటి వచ్చింది అని కూడా జనాలకు తెలియదు. ఆ సినిమాతో హీరోగా పరిచయం అయిన వాడే కార్తికేయ గుమ్మకొండ. తొలి సినిమా అలాంటి ఫలితాన్నిచ్చినా నిరాశ చెందకుండా మళ్లీ ప్రయత్నించాడు. మరోసారి సొంత బేనర్లో సినిమా ట్రై చేశాడు. అదే.. ఆర్ఎక్స్ 100. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలనం రేపిందో.. కార్తికేయ జీవితాన్ని ఎలా మార్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

‘నువ్వు నేను ప్రేమ’ లాంటి పెద్ద సినిమాను డైరెక్ట్ చేసిన టి.ఎన్.కృష్ణ.. తమిళంలో భారీ చిత్రాలు నిర్మించిన కలైపులి థాను లాంటి వాళ్లు కార్తికేయతో తెలుగు, తమిళ భాషల్లో సినిమా మొదలుపెట్టే స్థాయికి చేరుకున్నాడతను. ఆ చిత్రమే.. హిప్పీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది.

జూన్ 7న ‘హిప్పీ’ని రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు కార్తికేయ తెలిపాడు. ‘ఆర్ఎక్స్ 100’ జులై 12న విడుదలైందని.. నటుడిగా తాను పుట్టిన రోజు అదే అని.. ఇప్పుడు జూన్ 7న ‘హిప్పీ’ విడుదలవుతోంది కాబట్టి అది తనకు రీబర్త్ అని చాలా ఉద్వేగంగా చెప్పాడు కార్తికేయ. కొన్ని రోజుల కిందటే విడుదలైన ‘హిప్పీ’ టీజర్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. తొలి సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఇందులోనూ ముద్దుల మోత మోగించాడు. బాక్సింగ్ నేపథ్యం కూడా ఉండటంతో ఈ చిత్రం యువ ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షిస్తోంది.

హీరోగా ఇది కాకుండా కార్తికేయ ఇంకో రెండు సినిమాలు లైన్లో పెట్టాడు. అలాగే నాని చిత్రం ‘గ్యాంగ్ లీడర్’లో కార్తికేయ విలన్ పాత్ర కూడా చేస్తున్నాడు. మొత్తానికి ‘ఆర్ఎక్స్ 100’తో కార్తికేయ దశ తిరిగిపోయిందనే చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English