‘మా’లో ఇప్పుడే ఇలా ఉంటే..

‘మా’లో ఇప్పుడే ఇలా ఉంటే..

శివాజీ రాజా నేతృత్వంలోని గత ‘మా’ కార్యవర్గం మీద నరేష్ ప్యానెల్ చాలా ఆరోపణలు చేసింది. ‘మా’ ప్రతిష్టను దిగజార్చేశారని, అసోసియేషన్లో చాలా అక్రమాలు జరిగాయని.. ఇంకా ఏవేవో ఆరోపణలు చేశారు. వీటిలో నిజానిజాలెంత అన్నది పక్కన పెడితే.. నరేష్ ప్యానెల్ ఎన్నికల్లో గెలిచాక జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే.. ‘మా’ పరువు గంగలో కలిసేలాగే కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారం విషయంలో ఎంత రచ్చ జరిగిందో అందరూ చూశారు. దీని మీద ప్రెస్ మీట్ పెట్టి నానా రచ్చ చేశారు.

ఇటు నరేష్, అటు శివాజీ రాజా పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఇక ప్రమాణ స్వీకారం రోజు జరిగిన తతంగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావుతో హేమ పట్ల నరేష్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. స్వయంగా ఆయన ప్యానెల్ సభ్యులే ఆయన తీరును తప్పుబట్టారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మీ పథకాన్ని సినీ కళాకారులు కూడా ఉపయోగించుకోవాలంటూ ‘మా’ తరఫున పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ పథకం గురించి ‘మా’ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్న తలెత్తింది. దీని ద్వారా సినీ జనాలకు కలిగే ప్రయోజనం ఎంత.. దాని మీద ప్రకటనలకు ఖర్చు పెడుతున్నది ఎంత అన్న చర్చ నడుస్తోంది.

ఐతే ఈ ప్రకటనలకు అయిన ఖర్చు ఏడున్నర లక్షలే.. అది చాలా చిన్న మొత్తం అంటూ జీవిత ఏదో కవర్ చేసే ప్రయత్నం చేసింది కానీ.. ఎంత ఖర్చు అన్నది పక్కన పెడితే అసలీ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు సినీ జనాలు. ఈ ప్రకటనల విషయంలో ‘మా’లో అంతర్యుద్ధం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మొన్నటి ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా గెలిచిన సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.. నరేష్ అండ్ కో తీరు నచ్చక తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘మా’ ఎన్నికలు జరిగిన నెల రోజులకే ఇన్ని వివాదాలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో మున్ముందు ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో అని సెటైర్లు పడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English