ఈ అమ్మాయితో జాగ్రత్తండోయ్..!

ఈ అమ్మాయితో జాగ్రత్తండోయ్..!

విజయ్ దేవరకొండను చూసి వేరే వాళ్లు ఇన్‌స్పైర్ అయిపోతున్నారో ఏమో తెలియట్లేదు కానీ.. ఇంతకుముందులా ఆర్టిస్టులు బుద్ధిమంతుల్లా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ తరం యువత యారొగెన్స్, యాటిట్యూడ్‌ ఉన్న వాళ్లనే ఎక్కువ ఇష్టపడుతుండటంతో సినిమాల వేడుకల్లో, బయట ఇంటర్వ్యూల్లో కొంచెం తేడాగానే మాట్లాడుతున్నారు యంగ్ ఆర్టిస్టులు.

‘జెర్సీ’ సినిమాతో తెలుగులోకి అడుగు పెడుతున్న శ్రద్ధ శ్రీనాథ్.. ఇప్పటికే సమంత మీద చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. శ్రద్ధ కన్నడలో నటించిన ‘యు టర్న్’ సినిమాను తెలుగులో సమంత చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను తాను అరగంటకు మించి చూడలేకపోయానని.. ఒరిజినల్లో తాను చాలా బాగా చేశానని.. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేకపోయానని కొన్ని రోజుల కిందటే శ్రద్ధ చేసిన కామెంట్ సామ్ అభిమానులకు కోపం తెప్పించింది.

కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే ఇంత యాటిట్యూడా.. ఇలాగేనా మాట్లాడేది అన్న కామెంట్లు పడ్డాయి. ఐతే ఆ కామెంట్లు శ్రద్ధపై పెద్దగా ప్రభావం చూపినట్లు లేవు. ‘జెర్సీ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో శ్రద్ధ వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం. తెలుగులో చేసిన తొలి సినిమా వేడుకలో ఆమె ఎంతమాత్రం బెరుకుగా కనిపించలేదు. యాంకర్ సుమ వేదిక మీదికి పిలిచిన ఏవో ప్రశ్నలేస్తుంటే.. నేను పెద్ద స్పీచ్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను, ఈ ప్రశ్నలు, సమాధానాలేంటి అన్నట్లుగా మాట్లాడి పెద్ద షాకే ఇచ్చింది. మామూలుగా సుమనే అందరికీ పంచులేస్తుంటుంది కానీ.. ఆమెకే రివర్స్ పంచ్ ఇచ్చింది శ్రద్ధ.

ఆ తర్వాత తన పేరును ఒకటికి మూడుసార్లు నొక్కి వక్కాణించిన ఆమె.. ఇలా ఎందుకు తన పేరును మళ్లీ మళ్లీ చెబుతున్నానో కూడా వెల్లడించింది. ‘జెర్సీ’ తర్వాత తెలుగు ప్రేక్షకులు తన పేరును గుర్తుంచుకోవాల్సిందే అని.. అందుకే ఇలా చెబతున్నానని అంది. మరోవైపు నాని గురించి అభిమానులు అరుస్తుంటే ‘జై నాని అన్న’ అని కామెంట్ చేయడం శ్రద్ధ ఇచ్చిన మరో షాక్. మొత్తంగా ఈ ఈవెంట్లో ఎక్కడా కూడా ఒక కొత్తమ్మాయిలాగా కనిపించలేదు శ్రద్ధ. ఆమెను చూస్తుంటే ఫిమేల్ విజయ్ దేవరకొండ అన్న ఫీలింగ్ కలిగింది జనాలకు. ఈమెతో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్న కామెంట్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English