మూడు గంటలు రఫ్ఫాడుకోబోతున్న లారెన్స్

మూడు గంటలు రఫ్ఫాడుకోబోతున్న లారెన్స్

గతంతో పోలిస్తే ఈ రోజుల్లో మామూలుగానే సినిమాల నిడివి తగ్గిపోగా.. హార్రర్ కామెడీ జానర్లో సినిమాలు మరింత తక్కువ నిడివితో తెరకెక్కుతూ ఉంటాయి. హార్రర్, థ్రిల్లర్, కామెడీ జానర్లలో సినిమాల్ని చాలా వరకు కట్టె కొట్టె తెచ్చి అన్నట్లే లాగించేస్తుంటారు. మరీ ఎక్కువ నిడివి పెడితే ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. ఐతే రాఘవ లారెన్స్ రూటు మాత్రం వేరు. అతను ఏ సినిమా తీసినా మినిమం రెండున్నర గంటల లెంగ్త్ ఉంటుంది.

తొలి సినిమా ‘మాస్’ దగ్గర్నుంచి.. చివరగా తీసిన ‘గంగ’ వరకు అదే స్టయిల్ ఫాలో అయ్యాడు. హార్రర్ కామెడీ చిత్రాల్లోనూ అతను తన శైలి విడిచిపెట్టలేదు. కనీసం రెండున్నర గంటల నిడివి ఉండేలా చూసుకుంటూ వచ్చాడు. తనకు ఎక్కడ లేని పేరు, డబ్బు తెచ్చి పెట్టిన ‘కాంఛన’ సిరీస్‌లో లారెన్స్ తీసిన కొత్త సినిమా.. దర్శకుడిగా లారెన్స్ కెరీర్లో అత్యధిక నిడివితో రాబోతుండటం విశేషం.

'కాంఛన-3’ లెంగ్త్ 2 గంటల 55 నిమిషాలని సమాచారం. పొగాకు వ్యతిరేక ప్రకటనలతో కలిపితే ఇది మూడు గంటల సినిమా అనుకోవచ్చు. ఐతే ఈ రోజుల్లో నిడివి ఎక్కువ ఉండి కూడా ఆడుతున్న సినిమాలు తక్కువే. ఎంటర్టైన్మెంట్ మిక్సయి.. బలమైన ఎమోషన్ ఉన్న సినిమాలకు లెంగ్త్ అనేది సమస్య కావట్లేదు. కానీ ఒక మూసలో సాగిపోయే హార్రర్ కామెడీ సినిమాను మూడు గంటల పాటు భరించడం అంటే చాలా కష్టమే.

‘కాంఛన’ సిరీస్‌లో లారెన్స్ మార్కు అతి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ కోవై సరళను పెట్టుకుని నాటు కామెడీతో చెలరేగిపోతుంటాడు. ఇక హార్రర్ పేరుతో అతడి విన్యాసాలెలా ఉంటాయో కూడా తెలిసిందే. అన్నీ కూడా ఓవర్ ద టాప్, లౌడ్ సీన్లే ఉంటాయి. గోల మామూలుగా ఉండదు. ఇలాంటి సన్నివేశాలతో మూడు గంటల సినిమా అంటే.. థియేటర్లు గోల గోలగా మారడం ఖాయం. సినిమా బాగుంటే ఓకే కానీ.. తేడా వచ్చిందంటే మాత్రం ప్రేక్షకులు థియేటర్ల నుంచి పరారవ్వాల్సిందే. హార్రర్ కామెడీ పూర్తిగా ఔట్ డేట్ అయిపోయిన నేపథ్యంలో మూడు గంటల సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించడం లారెన్స్‌కు సవాలే. మరి అతనెలా ఈ సవాల్‌ను ఛేదిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English