రజనీ ‘దర్బార్’ తర్వాత కూడా..

రజనీ ‘దర్బార్’ తర్వాత కూడా..

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి ప్రకటించి ఏడాది దాటింది. ఆయనకు ఇప్పటికే 68 ఏళ్లు వచ్చేశాయి. ఈ వయసులో రాజకీయాల్లోకి వస్తున్నాడంటే ఇక సినిమాలకు టాటా చెప్పేస్తున్నట్లే అని అంతా అనుకున్నారు. ‘2.0’ ఆయన చివరి సినిమా అవుతుందని అనుకున్నారు. కానీ ఒకప్పుడు సినిమాలు తప్ప మరో ధ్యాస లేని సమయంలో ఆయన నెమ్మదిగా సినిమాలు చేశారు. సినిమాకు, సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకున్నారు.

కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెడతున్నట్లు ప్రకటించాక వరుసబెట్టి సినిమాలు చేసేస్తున్నారు. ‘2.0’ సెట్స్ మీద ఉండగానే.. ‘కాలా’ అనే సినిమాను లాగించేసిన రజనీ.. దీని తర్వాత చాలా తక్కువ వ్యవధిలో ‘పేట’ అనే చిత్రం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆరు నెలల వ్యవధిలో ఆయన సినిమాలు మూడు రిలీజై ప్రేక్షకులకు షాకిచ్చాయి.

ఐతే ‘పేట’ తర్వాత కూడా రజనీ ఆగట్లేదు. మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ సినిమా మొదలుపెట్టేశాడు. ఆ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఐతే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కాబట్టే రజనీ మళ్లీ ఇంకో సినిమా చేస్తున్నాడని.. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన పార్టీ ఉంటుంది కాబట్టి ‘దర్బార్’ తర్వాత ఇంకో సినిమా కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ ‘దర్బార్’ తర్వాత కూడా ఇంకో చిత్రం చేయడానికి రజనీ సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలొస్తుండటం విశేషం.

‘పేట’ తీసిన కార్తీక్ సుబ్బరాజ్ మళ్లీ రజనీతో ఇంకో చిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాడట. రజనీతో అతను కథా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రజనీ ఫేవరెట్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ సైతం రజనీతో ఓ సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఐతే ఇలాగే సినిమాలు చేసుకుంటూ పోతే.. రజనీ ఇంకెప్పుడు రాజకీయాలు చేస్తాడన్నది అర్థం కావడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English