నేనా ఓటీటీలకు దూరం కావ‌డ‌మా?

న‌వాజుద్దీన్ సిద్దిఖి.. బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఫాలో అయ్యేవాళ్ల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని పేరు. గ‌త రెండు ద‌శాబ్దాల్లో భార‌తీయ సినిమా నుంచి వెలుగులోకి వ‌చ్చి అత్యుత్త‌మ న‌టుల్లో అత‌నొక‌డు. గ‌త కొన్నేళ్ల‌లో అత‌డి ప్ర‌తిభ ప్ర‌పంచ స్థాయికి చేరింది. న‌వాజుద్దీన్ ఎంత గొప్ప న‌టుడో చెప్ప‌డానికి చాలా ఉదాహ‌ర‌ణ‌లున్నాయి.

గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సీపూర్ లాంటి సినిమాల్లో, సేక్రెడ్ గేమ్స్ లాంటి వెబ్ సిరీస్‌ల్లో త‌న న‌ట విశ్వ‌రూపాన్ని చూపించాడు న‌వాజ్. బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఓటీటీల‌కు అల‌వాటు ప‌డేలా చేయ‌డంలో అత‌డిది కీల‌క పాత్ర. అలాంటి న‌టుడు ఇటీవ‌ల ఓటీటీల గురించి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.

బాలీవుడ్లో పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ల‌కు ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు దందాలాగా మారాయ‌ని.. తాను ఓటీటీల్లో ఇక‌పై ఏ షోలూ చేయ‌న‌ని ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా న‌వాజ్ వ్యాఖ్యానించిన‌ట్లుగా వార్త‌లొచ్చాయి. దీనిపై మీడియాలో పెద్ద చ‌ర్చ జ‌ర‌గ‌డంతో న‌వాజ్ అప్ర‌మ‌త్తం అయ్యాడు. త‌న వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చాడు.

త‌న వ్యాఖ్య‌ల ఉద్దేశం వేర‌ని, వాటిని వేరే కోణంలో చూడాల‌ని అన్నాడు. తాను ఓటీటీల‌కు దూరం అవుతున్న‌ట్లుగా జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని అత‌ను ఖండించాడు. నేను ఎన్నో ఓటీటీ షోలు చేస్తున్నా. అస‌లు నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు నెట్ ఫ్లిక్స్ ఒక ముఖ్య కార‌ణం. మ‌న ప్ర‌తిభ‌కు ప్ర‌పంచ స్థాయి గుర్తింపు తెచ్చింది ఓటీటీలే. అలాంటి వాటికి దూరంగా ఉంటాన‌ని నేనెలా అంటాను. నా వ్యాఖ్య‌ల ఉద్దేశం వేరు. కొన్ని ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లు ఓటీటీల ద్వారా సీరియ‌ళ్ల త‌ర‌హా షోలు తీస్తున్నాయి. అలాంటి వాటిలో నేను న‌టించ‌న‌న్నా త‌ప్ప‌.. పూర్తిగా ఓటీటీల‌కు దూరం అవుతాన‌ని అన‌లేదు అని న‌వాజ్ స్ప‌ష్టం చేశాడు.