నానిని ఇబ్బంది పెడుతోన్న అక్కినేనీ'స్‌

నానిని ఇబ్బంది పెడుతోన్న అక్కినేనీ'స్‌

మూస సినిమాలు చేస్తున్నాడనే విమర్శలతో విసిగిపోయిన నేచురల్‌ స్టార్‌ నాని పంథా మార్చాడు. కొత్త తరహా కథలని ఎంచుకుని మరీ రిస్క్‌ చేస్తున్నాడు. నాని ఎంతో ఇష్టపడి, కష్టపడి చేసిన 'జెర్సీ' ఈ శుక్రవారం విడుదల కానుంది. పక్కా స్పోర్ట్స్‌ డ్రామా అయిన ఈ చిత్రం కోసం నాని దాదాపు మూడు నెలల పాటు క్రికెట్‌లో శిక్షణ తీసుకున్నాడు. గంటల కొద్దీ నెట్‌ ప్రాక్టీస్‌తో పాటు రియల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడి క్రికెట్‌పై పట్టు సాధించాడు. అంత కష్టపడ చేసిన ఈ జెర్సీ మిగతా చిత్రాల మధ్య ప్రత్యేకంగా కనిపించాలి. కానీ ఈ చిత్రం ట్రెయిలర్‌ చూస్తే ఇటీవలే విడుదలైన 'మజిలీ' పోలికలు బాగా కనిపించాయి. అందులో కూడా చైతన్య క్రికెటర్‌ అయినా కానీ లవ్‌లో ఫెయిలై, కెరియర్‌ లేక భార్య సంపాదనపై ఆధారపడతాడు. చివరకు ఒక టీనేజ్‌ పిల్లకి కోచ్‌గా తన కల సాకారం చేసుకుంటాడు.

జెర్సీ కథ కూడా ఇంచుమించు ఇలాగే వుంటుంది. అయితే ఇక్కడ హీరో కోచ్‌గా కాకుండా ముప్పయ్‌ ఆరేళ్ల వయసులో క్రికెట్‌ టీమ్‌లో చోటు సంపాదిస్తాడు. సహజంగానే జెర్సీ ప్రమోషన్స్‌లో నానిని 'మజిలీ'కి సంబంధించిన ప్రశ్న ఇబ్బంది పెడుతోంది. తాను ఎంతో ప్రత్యేకంగా వుందనుకుని చేసిన ఈ చిత్రాన్ని ఇటీవలే వచ్చిన చిత్రంతో పోలుస్తున్నారేంటని నాని హర్టవుతున్నాడు. మాట వరసకి ఆ సినిమా చూడలేదని చెబుతున్నా కానీ ఇంతమంది చెబుతున్నపుడు ఖచ్చితంగా జెర్సీ టీమ్‌ మజిలీ చూసే వుండాలి. అయితే జెర్సీ పక్కా స్పోర్ట్స్‌ ఫిలిం అని, ఇందులోని క్రికెట్‌ మ్యాచ్‌లు రియల్‌ మ్యాచ్‌లు చూస్తోన్న భావన కలిగిస్తాయని చెబుతున్నారు. మరి జెర్సీపై మజిలీ ప్రభావం ఏమైనా పడుతుందా లేదా అనేది ఈ శుక్రవారానికి తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English