క్షణం దర్శకుడికి ఏమైంది?

క్షణం దర్శకుడికి ఏమైంది?

తొలి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక ఒక దర్శకుడు తర్వాతి మూడేళ్లు ఖాళీగా ఉండటం ఆశ్చర్యకరమే. ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరెపు పరిస్థితి ఇదే. ‘క్షణం’ సినిమాలో మేకింగ్‌లో హీరో అడివి శేష్ పాత్ర కూడా కీలకమే అయినప్పటికీ.. రవికాంత్ ప్రతిభను తక్కువ చేయలేం. అతడికి మంచి పేరే వచ్చింది. దీని తర్వాత అతను రానా దగ్గుబాటి హీరోగా ఒక సినిమా మొదలుపెడతాడని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత దాని గురించి అప్ డేట్ లేదు.

మధ్యలో ‘దొరసాని’ పేరుతో రవికాంత్ దర్శకుడిగా ఇంకో సినిమా తెరపైకి వచ్చింది. కానీ దాని సంగతేమైందో తెలియదు. తాజాగా ‘దొరసాని’ అనే పేరుతో వేరే దర్శకుడు ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. కాబట్టి రవికాంత్ ఈ పేరుతో సినిమా చేయనట్లే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా, రాజశేఖర్ రెండో కూతురు శివాత్మికలను పరిచయం చేస్తూ రవికాంత్ సినిమా మొదలు కానున్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ దాని సంగతీ అతీ గతి లేదు.

మొత్తానికి ఒక బ్లాక్ బస్టర్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన రవికాంత్ ఇలాంటి స్థితికి చేరుకుంటాడని ఎవ్వరూ ఊహించలేదు. ‘జెర్సీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న శ్రద్ధ శ్రీనాథ్ సైతం.. తనకు రవికాంత్ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు చెప్పడం విశేషం. ‘జెర్సీ’ కంటే ముందే తాను సురేష్ ప్రొడక్షన్స్‌లో రవికాంత్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకున్నానని.. 2017లోనే ఈ చిత్రానికి సంతకం చేశానని వెల్లడించింది. కానీ ఆ సినిమా ముందుకు కదల్లేదని.. ‘జెర్సీ’తోనే తాను టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నానని అంది.

అంటే పైన చెప్పుకున్న మూడు సినిమాలకు తోడు.. శ్రద్ధ చెబుతున్న ప్రాజెక్టు కూడా రవికాంత్‌తో ముడిపడ్డదే. మరి ఇన్ని ప్రాజెక్టులకు కన్సిడర్ చేసినా ఇప్పటిదాకా అతడి రెండో సినిమా విడుదల కాకపోవడం.. అసలు ఇప్పుడు ఏది లైన్లో ఉందో కూడా తెలియకపోవడం విడ్డూరమే. మరి రవికాంత్ ఎప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English