లారెన్స్ ఫెయిలైతే జానర్‌ మూసేయొచ్చు

లారెన్స్ ఫెయిలైతే జానర్‌ మూసేయొచ్చు

హార్రర్ కామెడీ.. మన దగ్గర అరిగిపోయిన జానర్. ‘ప్రేమకథా చిత్రమ్’ తర్వాత ఇబ్బడిముబ్బడిగా ఈ జానర్లో సినిమాలొచ్చాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. ఐతే తర్వాత తర్వాత జనాలకు మరీ మొహం మొత్తేయడంతో ఆ జానర్లో సినిమాలు తగ్గిపోయాయి. ఐతే తెలుగులో ఈ జానర్ ఔట్ డేట్ అయిపోయి వరుసగా ఆ జానర్ సినిమాలు తుస్సుమంటున్న రోజుల్లో కూడా రాఘవ లారెన్స్ ‘గంగ’తో సక్సెస్ సాధించగలిగాడు.

కొన్నేళ్ల కిందట వచ్చిన ఆ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ పెద్ద విజయం సాధించింది. ఇప్పుడతను ఈ సిరీస్‌లో కొత్త సినిమా ‘కాంఛన-3’తో బాక్సాఫీస్ దాడికి రెడీ అయ్యాడు. ఐతే దీని ట్రైలర్ చూస్తే లారెన్స్ ఏమీ కొత్తగా చూపించేలా కనిపించడం లేదు. మళ్లీ తనకు అలవాటైన డిష్‌నే వడ్డించడానికి రెడీ అయినట్లున్నాడు.

హార్రర్ కామెడీలు అంత త్వరగా ఔట్ డేట్ అయిపోవడానికి కారణం.. అవన్నీ ఒకే తరహా కథలతో తెరకెక్కి జనాల్ని విసిగించేయడమే ఓ వ్యక్తిని అన్యాయంగా ఎవరో చంపేస్తారు.. ఆ వ్యక్తి దయ్యమై ఓ ఇంట్లోకి చేరుతుంది. అక్కడ ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఇంటర్వెల్‌ సమయానికి దయ్యం గుట్టు తెలుస్తుంది. ద్వితీయార్ధంలో ఫ్లాష్‌ బ్యాక్‌ మొదలవుతుంది. అదయ్యాక మెయిన్‌ విలన్‌ పని పట్టడం. కథ సుఖాంతం. మిగతా హార్రర్ కామెడీలతో పాటు లారెన్స్ తీసిన సినిమాల వరస కూడా ఇదే. ఐతే లారెన్స్ ఏదైనా ఎక్స్‌ట్రీమ్‌గా చూపించడం ద్వారా జనాల్లో ఆసక్త ిరేకెత్తించగలిగాడు.

భయపెట్టడంలోనే కాక నవ్వించడంలోనూ విజయవంతం అయ్యాడు. ముఖ్యంగా మాస్ పల్స్ తెలిసి ఉండటం అతడికి కలిసొచ్చింది. కానీ ఇప్పుడు మాస్ జనాలు సైతం రొటీన్ సినిమాల్ని తిరస్కరిస్తున్నారు. కొత్తదనం లేకుంటే సినిమాల్ని ఆదరించడం లేదు. తాజాగా ‘ప్రేమకథా చిత్రమ్-2’ అనే హార్రర్ కామెడీ తెలుగులో డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో లారెన్స్ కనుక ఫెయిలైతే తెలుగులో హార్రర్ కామెడీ అనే జానర్ అదృశ్యం కావడం ఖాయం. ఈ నెల 19నే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English