మన ఆడబిడ్డకు యూపీలో గెలుపు కష్టమేనా?

మన ఆడబిడ్డకు యూపీలో గెలుపు కష్టమేనా?

రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రముఖ సినీనటి జయప్రదకు గెలుపు అంత ఈజీ కాదా? తనకు అచ్చివచ్చిన ఇలాకాలో గెలుపు కోసం ఆమె చెమటోడుస్తున్నారా? ఒకనాడు నమ్మినబంటు నేడు పక్కలో బల్లెంగా మారారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నాటి మిత్రులు, నేడు శత్రువులైన జయప్రద, ఆజంఖాన్ ఇక్కడ హోరాహోరీగా తలపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.

సరిగ్గా పదిహేనేళ్ల కిందట రామ్‌పూర్ నవాబ్ కుటుంబ సభ్యురాలైన బేగం నూర్‌భానోకు పోటీగా జయప్రదను స్వయంగా ఆజంఖానే రామ్‌పూర్‌కి తీసుకువచ్చారు. ఆయన తోడ్పాటుతో 2004లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద 85 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. అయితే ఆ తర్వాతి ఐదేళ్లలో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వైరం పెరిగింది. ఈ క్రమంలో జయప్రద.. అమర్‌సింగ్ గూటికి చేరారు. అప్పట్లో ఆయన ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. మరోవైపు 2009 లోక్‌సభ ఎన్నికల నాటికి ఆజంఖాన్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ విషయంలో పార్టీ వైఖరిపై ములాయంతో విభేదించి ఎస్పీని వీడారు. 2009 ఎన్నికల్లోనూ రామ్‌పూర్ నుంచే జయప్రద బరిలోకి దిగారు.

కాంగ్రెస్ తరఫున మరోసారి నూర్ బానో పోటీచేశారు. జయప్రద గెలుపు బాధ్యతను అమర్‌సింగ్ భుజానికెత్తుకున్నారు. అయితే జయప్రదను ఓడించేందుకు ఆజంఖాన్ తీవ్రంగా ప్రయత్నించారు. ముస్లిం ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ వారు ఎస్పీ వైపు మొగ్గడంతో జయప్రద స్వల్ప మెజార్టీతో ఆ ఎన్నికల్లో గట్టెక్కారు. ఆజమ్ ప్రభావం కారణంగా ఆమె మెజార్టీ 30 వేలకు పడిపోయింది.2014 నాటికి అమర్‌సింగ్, జయప్రద సమాజ్‌వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ తరఫున వారిద్దరూ పోటీచేసి ఓటమిపాలయ్యారు. మరోవైపు 2012 శాసనసభ ఎన్నికలకు ముందు ఆజంఖాన్ తిరిగి ఎస్పీ గూటికి చేరారు. 2012 ఎన్నికల్లో రామ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి అఖిలేశ్ కేబినెట్‌లో ఆయన మంత్రి పదవిని కూడాదక్కించుకున్నారు.
 
జయప్రద సన్నిహితుడుగా పేరొందిన అమర్‌సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో ఉన్న సాన్నిహిత్యంతో జయప్రదను బీజేపీలో చేర్పించారు. ఈ క్రమంలో రామ్‌పూర్ నుంచి మూడోసారి పోటీచేసే అవకాశం ఆమెకు దక్కింది. ఆజంఖాన్‌తో నెలకొన్న వైరం.. ఈ ఎన్నికల్లో నేరుగా తలపడేలా చేసింది. ఇద్దరి మధ్యా ప్రస్తుతం హోరాహోరీ పోరు నడుస్తున్నది. ఈసారి కాంగ్రెస్ పార్టీ నూర్ భానోకు బదులు బిలాస్‌పూర్ మాజీ ఎమ్మెల్యే సంజీవ్ కపూర్‌ను బరిలో నిలిపింది. ముస్లిం అభ్యర్థిని నిలిపి ఉంటే ఆజంఖాన్ ఓట్లు చీలిపోయే అవకాశం ఉండేది. మరోవైపు జయప్రద ఓట్లను సంజీవ్ కుమార్ చీల్చే ప్రమాదం ఉందని బీజేపీ ఆందోళన చెందుతున్నది. జయప్రదకు వ్యతిరేకంగా ఎస్పీ, కాంగ్రెస్ చేతులు కలిపాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్థూలంగా తెలుగు ఆడబిడ్డకు గెలుపు సులభం కాదంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English