ఏడాదికి పన్నే 70 కోట్లు కట్టాడంటే..

 ఏడాదికి పన్నే 70 కోట్లు కట్టాడంటే..

రెండు దశాబ్దాల కిందట బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలిసిందే. హీరోగా మార్కెట్ దెబ్బ తిని సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయి.. మరోవైపు చేసిన వ్యాపారాలన్నీ నష్టాలు తెచ్చి పెట్టి.. దివాళా తీసే స్థితిలో ఉన్నాడాయన. అలాంటివాడు ఇప్పుడు ఒక ఏడాదిలో రూ.70 కోట్ల పన్ను కడుతున్నాడు అంటే ఎలాంటి స్థితిలో ఉన్నాడో అంచనా వేయొచ్చు. 2018-19 సంవత్సరానికి అమితాబ్ రూ.70 కోట్ల పన్ను కట్టి రికార్డు సృష్టించారు. ఇండియాలో ఈ వార్షిక సంవత్సరానికి అత్యధిక పన్ను కట్టిన నటుడు అమితాబే కావడం విశేషం.

పన్నే రూ.70 కోట్లు కట్టాడంటే ఆయ ఆదాయం వందల కోట్లలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 76 ఏళ్ల వయసులో కూడా ఆయన తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఏడాదికి అరడజను దాకా సినిమాల్లో కనిపిస్తున్నాడు. వీటి ద్వారా భారీగా పారితోషకాలు అందుకుంటున్నారు. కొన్ని సినిమాల్లో లాభాల్లో వాటా కూడా దక్కుతోంది. మరోవైపు అమితాబ్ రెండంకెల సంఖ్యలో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. వీటి ద్వారా కూడా భారీగా రెమ్యూనరేషన్లు వస్తున్నాయి. ఇవి కాక కొన్ని బిజినెస్‌ల ద్వారా కూడా అమితాబ్‌ ఆదాయం పొందుతున్నారు.

మొత్తంగా ఆయన వార్షికాదాయం వందల కోట్లలోనే ఉంటోంది. కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్ కూడా సినిమాల్లో ఉన్నప్పటికీ అమితాబ్‌తో పోలిస్తే వాళ్ల ఆదాయం చాలా తక్కువ. ఈ వయసులోనూ విరామం లేకుండా ఎంతో ఉత్సాహంగా నటిస్తూ, వ్యాపారాలు నిర్వహిస్తూ ఇంత ఆదాయం ఆర్జిస్తుండటం అమితాబ్ గొప్పదనం. ఇటీవలే ఆయన తాప్సితో కలిసి నటించిన ‘బద్లా’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English