నిజంగా చిన్మయికి అంత ధైర్యం ఉందా?

 నిజంగా చిన్మయికి అంత ధైర్యం ఉందా?

‘మీ టూ’ మూమెంట్ దక్షిణాదిన ఊపందుకోవడానికి ముఖ్య కారణం గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయినే. లెజెండరీ లిరిసిస్ట్ వైరముత్తు మీద ఆమె సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పెద్ద మనిషిగా చెలామణి అయ్యే వైరముత్తు నీచుడని.. ఆయనకు అమ్మాయిల పిచ్చి ఉందని.. తనతో సహా ఎందరో అమ్మాయిల్ని లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడని చిన్మయి ఆరోపించింది.

వైరముత్తు బారిన పడ్డ వేరే అమ్మాయిల ఉదంతాల్ని కూడా ఆమె వెలుగులోకి తెచ్చింది. తనకు ఎవరూ మద్దతు ఇవ్వకపోయినా అలుపెరగని పోరాటం చేసింది. కానీ ఆ పోరాట ఫలితంగా చిన్మయికి న్యాయం జరగకపోగా.. తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి ఆమెను ఏదో కారణం చెప్పి తప్పించారు. గాయనిగా కూడా ఆమెకు అవకాశాలు తగ్గాయి. అయినా కూడా చిన్మయి ఏమీ తగ్గట్లేదు.

తాజాగా ఆమె వైరముత్తును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈసారి వైరముత్తు తనకు ఎదురు పడితే ఆయన చెంప చెల్లుమనిపిస్తానని చిన్మయి చెప్పడం విశేషం. తాజాగా తమిళ సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బు ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తే అతడ చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దీని గురించి ప్రస్తావించిన ఒక నెటిజన్.. మీరు కూడా మిమ్మల్ని వేధించిన వాళ్లకు ఇలా బుద్ధి చెప్పగలరా అని చిన్మయిని ప్రశ్నించాడు. దీనికి చిన్మయి బదులిస్తూ.. ‘‘కచ్చితంగా. ఈ సారి నాకు వైరముత్తు కనిపిస్తే తప్పకుండా చెంప చెళ్లుమనిపించాలన్న విషయం గుర్తు పెట్టుకుంటా. చూస్తుంటే.. నాకు కేవలం ఈ విధంగా మాత్రమే న్యాయం జరిగేలా ఉంది’’ అని చిన్మయి వ్యాఖ్యానించింది. కానీ చిన్మయి వైరముత్తుపై మాటలతో ఆరోపణలు చేసినందుకే ఆమె కెరీర్ దెబ్బ తింది. మరి చెంపచెల్లుమనిపిస్తే ఇంకేమైనా ఉందా..? నిజంగా వైరముత్తుకు అలా బుద్ధి చెప్పేంత ధైర్యం చిన్మయికి ఉందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English