ట్రాక్‌లోకి రావడానికి ఈ టాక్ సరిపోతుందా?

ట్రాక్‌లోకి రావడానికి ఈ టాక్ సరిపోతుందా?

సక్సెస్ కోసం సాయిధరమ్ తేజ్ ఎంతగా ఎదురు చూస్తున్నాడో తెలిసిందే. ఏకంగా అరడజను ఫ్లాపులు వచ్చాక ఎలాంటి హీరోకైనా కష్టంగానే ఉంటుంది. అందులోనూ చాలా తక్కువ సమయంలో అతడికి ఎక్కువ పరాజయాలు పలకరించాయి. దీంతో కాన్ఫిడెన్స్ బాగా దెబ్బ తినేసింది. ఈ నేపథ్యంలో తేజు చాలా మారిపోయాడు.
ఇంతకుముందు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ‘చిత్రలహరి’ చేశాడు. దీని కోసం లుక్ మార్చుకున్నాడు. బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ స్టైల్ కూడా మార్చేశాడు. చివరికి తన పేరును కూడా సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. ప్రోమోలు బాగుండటంతో తేజు గత సినిమాలతో పోలిస్తే దీనికి కాస్త క్రేజ్ వచ్చింది. శుక్రవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే ఈ చిత్రానికి టాక్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.

తేజు గత సినిమాల్లా దీనికి డిజాస్టర్ టాక్ రాకపోవడం మాత్రం ఊరటనిచ్చే విషయం. అలాగని ఇది పక్కా హిట్ అనే మాట కూడా వినిపించడం లేదు. చూసిన వాళ్లందరూ పర్వాలేదు అంటున్నారు. మెజారిటీ జనాలు ఒకసారి చూడొచ్చు అంటున్నారు. కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. చూసి తీరాల్సిందే అని మాత్రం ఎవరూ అనడం లేదు. రివ్యూలు కూడా యావరేజ్ రేంజ్‌లోనే ఉన్నాయి. ఒక హీరో మంచి ఊపు మీద ఉంటే యావరేజ్‌ టాక్‌తోనూ సినిమాను లాక్కెళ్లి పోవచ్చు. కానీ తేజు ఇప్పుడున్న స్థితిలో అతడి సినిమా చూడ్డానికి జనాలు థియేటర్లకు కదలాలంటే చాలా మంచి టాక్ రావాలి.

‘చిత్రలహరి’కి అలాంటి టాక్ రాకపోవడం ప్రతికూలం. ఐతే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో జనాలు ఓ మోస్తరు సినిమాలున్నా సరే థియేటర్లకు వస్తారు. కాకపోతే ముందు వారం వచ్చిన ‘మజిలీ’ ఇంకా బాగా ఆడుతుండటం, వచ్చే వారం రాబోయే ‘జెర్సీ’ సినిమాకు మంచి హైప్ ఉండటం ‘చిత్రలహరి’కి ఇబ్బందికరమైన విషయాలే. నాని చిత్రానికి మంచి టాక్ వస్తే మాత్రం దీని మనుగడ కష్టమవుతుంది. మరి ఆ లోపు బయ్యర్ల పెట్టుబడిని ఈ చిత్రం వెనక్కి తెస్తుందో లేదో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English