కంగనా అంతలా తిడుతున్నా..

కంగనా అంతలా తిడుతున్నా..

కంగనా రనౌత్‌ను లేడీ రామ్ గోపాల్ వర్మ అనొచ్చు. సినిమాలతో కంటే తన వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటుంది. ఎవరో ఒకరితో తరచుగా సున్నం పెట్టుకోవడం ఆమెకు అలవాటు. తమ పాటికి తాము ఉన్న వాళ్లను గిచ్చి గిచ్చి వివాదాల్లోకి లాగుతుంటుంది. తన వ్యాఖ్యల్ని అవతలి వాళ్లు పట్టించుకుని తిరిగి తిడితే ఆమెకు మహా సంతోషం.

అప్పుడు తాను మరింతగా రెచ్చిపోవచ్చు. వివాదాన్ని పెద్దది చేయొచ్చు అని ఆరాటపడుతూ ఉంటుంది. గత కొంత కాలంగా ఆమె ఆలియా భట్‌ను అదే పనిగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ కిడ్స్ అంటే విపరీతమైన ద్వేషం చూపించే కంగనాకు.. మహేష్ భట్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చి చాలా తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ సంపాదించిన ఆలియా భట్ అంటే మంట. అందుకేనేమో ఆమెను తరచుగా విమర్శిస్తూ ఉంటుంది.

ఆలియా నటనను తక్కువ చేయడమే కాక.. వివిధ అంశాలపై ఆమె స్పందించకపోవడంపై, రణబీర్ కపూర్‌తో ఆమె ప్రేమాయణం మీద కూడా ఇంతకుముందు సెటైర్లు వేసింది కంగనా. అయినా ఆలియా సంయమనం పాటించింది. కంగనాను తిరిగి ఒక మాట అనలేదు. ఐతే తాజాగా కంగనా మరోసారి ఆలియాను టార్గెట్ చేసింది. గత ఏడాది కాలానికి ఎవరు బెస్ట్ యాక్ట్రెస్ అనే విషయాన్ని తేల్చేందుకు తాజాగా ఒక మీడియా సంస్థ ఒక సర్వే చేసింది. అందులో ‘మణికర్ణిక’లో నటనకు గాను కంగనాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ‘గల్లీబాయ్’లో పాత్రకు ఆలియా రెండో స్థానం సాధించింది.

ఐతే తనకు ఆలియాతో పోలికేంటి.. ఈ సర్వే కోసం ఆమె పేరు ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు అంటూ కంగనా విడ్డూరంగా మాట్లాడింది. ‘గల్లీబాయ్’లో ఆలియాది ఒక యాక్టింగా అని ఎద్దేవా చేసింది. ఇలాంటి స్థితిలో ఎవరైనా సంయమనం కోల్పోతారు. దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేస్తారు. ఐతే కంగనా కోరుకునేది ఇదే కాబట్టి ఆలియా మరోసారి కూల్‌గా బదులిచ్చింది. కంగనానే గ్రేట్ యాక్ట్రెస్ అని పొగిడింది. ఆమె గతంలో ‘రాజి’ సినిమాకు గాను తన నటనను పొగిడిందని గుర్తు చేసింది. మళ్లీ ఆమె తనను పొగిడే రోజు కోసం ఎదురు చూస్తానని అంది. ఆలియా మెచ్యూరిటీ చూసి అందరూ ఆమెను పొగుడుతున్నారు. అతి చేస్తున్న కంగనాను తిట్టిపోస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English