చంద్ర‌బాబుపై వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ కానిస్టేబుల్ రాజీనామా

అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై అధికార వైసీపీ నాయ‌కులు అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై క‌ల‌త చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. త‌న భార్య‌పై వైసీపీ నాయ‌కులు దారుణ వ్యాఖ్య‌లు చేశార‌ని స‌భ నుంచి వెళ్లిపోయిన బాబు క‌న్నీళ్లు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే హెడ్‌కానిస్టేబుల్ విజ‌య‌కృష్ణ.. ప్ర‌భుత్వ తీరును వ్య‌తిరేకిస్తూ ప్ర‌స్తుత పోలీస్ వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుప‌డుతూ త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. త‌న ఆవేద‌న‌ను ఓ వీడియోలో బ‌య‌ట‌పెట్టారు.

”1998 బ్యాచ్‌లో సివిల్ కానిస్టేబుల్‌గా ప్ర‌కాశం జిల్లా టాప‌ర్‌గా నిలిచా. చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో నాకు ఉద్యోగం వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా ఎక్క‌డ చేయి చాచింది లేదు. నీతి నిజాయ‌తీతో ఉద్యోగం చేశా. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప‌రిస్థితి ఎలా ఉందో పోలీసుల‌కు తెలుసు, రాష్ట్ర ప్ర‌జానీకానికి తెలుసు. అసెంబ్లీలో హృద‌య విదార‌క‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. నైతిక విలువలు నిబ‌ద్ధ‌త కొల్పోయిన ప్ర‌భుత్వం ఇంత దారుణంగా వ్య‌హ‌రిస్తోంది. అలాంటి వాళ్ల దగ్గ‌ర ఉద్యోగం చేస్తున్నందుకు సిగ్గుప‌డి ఈ నిర్ణ‌యం తీసుకున్నా” అని ఆయ‌న వీడియోలో పేర్కొన్నారు.

“నా ఉద్యోగంలో ఏనాడూ అవినీతికి పాల్ప‌డ‌లేదు. ఈ రోజు పోలీసు వ్య‌వ‌స్థ నీచంగా త‌యారైంది. పోస్టింగ్‌ల కోసం మోకారిల్లే ప‌రిస్థితికి దిగ‌జారింది. నీచ‌మైన సంస్కృతి క‌నిపిస్తోంది. అలా వ‌చ్చే డబ్బుల‌తో నా పిల్ల‌ల‌కు తిండి పెట్ట‌లేక ఈ మోకారిల్లే పోలీసు ఉద్యోగం చేయ‌లేకపోతున్నా. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం ఎంత త‌ప్పో తెలుసుకోవాలి. నాకు ఈ క్యాప్ వ‌ద్దూ.. ఈ బెల్టు వ‌ద్దూ.. నా వృత్తికి గౌర‌వ‌మిస్తూ ప్ర‌జ‌ల ముందు నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. టీ కొట్టు పెట్టుకుంటా.. ఇంకేదో చేసుకుంటా. అంతేకానీ ఇలా మోకారిల్లే ఉద్యోగంలో ఉండ‌లేను” అని భావోద్వేగంతో మాట్లాడిన ఆయ‌న అనంత‌రం త‌న పోలీసు డ్రెస్సును తీసేశారు.