ఆ సినిమాను సుకుమార్ క్యాన్సిల్ చేయించాడా?

ఆ సినిమాను సుకుమార్ క్యాన్సిల్ చేయించాడా?

తమిళంలో సూపర్ హిట్టయిన ‘తెరి’ తెలుగు రీమేక్ గురించి మూడేళ్లుగా డిస్కషన్లు నడుస్తున్నాయి. ముందు పవన్ కళ్యాణ్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా పెట్టుకున్నారు. అతను స్క్రిప్టు కూడా రెడీ చేశాడు. కానీ పవన్ అడ్వాన్స్ కూడా తీసుకుని ఈ చిత్రం చేయలేకపోయాడు. రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఈ సినిమా చేసే వీలు లేకపోయింది. పవన్ మళ్లీ ఎప్పుడు ఖాళీ అవుతాడో తెలియక అతడిపై ఆశలు వదులుకున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవితేజతో ఈ చిత్రం చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు.

కానీ అనివార్య కారణాలతో అతడితో కూడా సినిమా వర్కవుట్ కాలేదు. ఇదిగో అదిగో సినిమా మొదలుపెట్టేస్తారని వార్తలు రావడం.. మళ్లీ బ్రేక్ పడటం.. ఇలా సాగుతోంది వరస. మధ్యలో ఈ సినిమాను పక్కన పెట్టేసినట్లే కనిపించారు కానీ.. ఈ మధ్య మళ్లీ ఇది సెట్స్ మీదికి వెళ్లనున్నట్లు వార్తలొచ్చాయి.

కానీ చివరగా తేలిందేమంటే.. ఈ సినిమాను మైత్రీ వాళ్లు చెత్త బుట్టలోకి వేసేశారట. వాళ్లు ఈ నిర్ణయం తీసుకోవడంలో సుకుమార్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ‘రంగస్థలం’తో సుక్కుకు మైత్రీ వాళ్లతో బాగా అటాచ్మెంట్ కుదిరింది. ఆ సంస్థలో ఒకడైపోయాడు సుక్కు. తన తర్వాతి సినిమాను కూడా ఆ సంస్థలోనే చేస్తున్న సుక్కు.. వారి భాగస్వామ్యంలో కొన్ని చిన్న సినిమాలు నిర్మిస్తున్నాడు. అంతే కాక ‘మైత్రీ’లో తెరకెక్కే ప్రతి సినిమా కథనూ వింటూ మార్పులు చేర్పులు కూడా సూచిస్తున్నాడు. ‘చిత్రలహరి’కి కూడా ఆయన ఇన్ పుట్స్ కీలకమని హీరో, దర్శకుడు చెప్పిన సంగతి తెలిసిందే.

మైత్రీ సంస్థలో ఏ సినిమా తెరకెక్కాలన్నా ఇప్పుడు సుక్కు ఆమోద ముద్ర పడాల్సి ఉంది. ఐతే వరుసగా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తున్న ఈ బేనర్లో.. ‘తెరి’ లాంటి రొటీన్ మాస్ మసాలా సినిమా తెరకెక్కడం వల్ల పేరు పోతుందని, ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిన నేపథ్యంలో ఇది కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువ అని సుక్కు చెప్పాడట. ఇప్పటిదాకా స్క్రిప్ట్ వర్క్ కోసం పెట్టిన ఖర్చు పోయినా పర్వాలేదని చెప్పి ఆయనే ఈ సినిమాను ఆపించినట్లు సమాచారం. దీని వల్ల నష్టపోయిన సంతోష్ శ్రీనివాస్‌కు మైత్రీలో మరో అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. కాకపోతే అతను తన సొంత కథతో ఎవరైనా హీరోను మెప్పించాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English