ఊరించి ఊరించి హ్యాండిస్తున్నారు

ఊరించి ఊరించి హ్యాండిస్తున్నారు

వి.వి.వినాయక్.. ఒక్క సినిమాతో ‘స్టార్’ స్టేటస్ సంపాదించిన దర్శకుడు. తొలి సినిమా ‘ఆది’ తర్వాత అతను వెనుదిరిగి చూసుకున్నది లేదు. ఎప్పుడూ హై ప్రొఫైల్ డైరెక్టర్‌గానే ఉన్నాడు. బడా బడా స్టార్లతోనే సినిమాలు చేశాడు. వినాయక్‌తో సినిమాలు చేయడానికి స్టార్లు పోటీ పడే పరిస్థితి. ఎన్నో బ్లాక్ బస్టర్‌లు అందించిన ఈ దర్శకుడు రెండేళ్ల కిందట కూడా ‘ఖైదీ నంబర్ 150’తో నాన్-బాహుబలి రికార్డ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఏం లాభం? ఆ సినిమా రీమేక్ కావడం వల్ల వినాయక్‌ కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు.

మారిన ట్రెండ్‌కు తగ్గట్లుగా సినిమాలు తీయలేక వినాయక్‌ ఔట్ డేటెడ్ అయిపోయాడు. ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత వినాయక్ తీసిన ‘ఇంటిలిజెంట్’ టాలీవుడ్ ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ దెబ్బతో వినాయక్ దయనీయమైన స్థితికి చేరుకున్నాడు.

ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్లతోనే సినిమాలు చేసిన వినాయక్‌కు మీడియం రేంజి హీరోలు కూడా దొరకని పరిస్థితి. ఏడాది నుంచి కష్టపడుతున్నా ఏ హీరోనూ కమిట్ చేయలేకపోయాడు. సినిమా చేస్తా అని ఊరించిన వాళ్లు కూడా ఒక్కొక్కరుగా హ్యాండిచ్చేస్తున్నారు. ‘ఇంటిలింజెట్’ తీసిన సి.కళ్యాణే బాలయ్య డేట్లు తీసుకుని వినాయక్‌తో సినిమా సెట్ చేసి పెట్టాడు. కానీ బాలయ్యను మెప్పించే కథ రెడీ చేయలేకపోయాడు వినాయక్. మామూలుగా బాలయ్య కథ విషయంలో మరీ అంత పట్టింపుతో ఉండడంటారు. తన క్యారెక్టర్ నచ్చితే సినిమా చేసేస్తాడంటారు. అలాంటి హీరోను కూడా మెప్పించలేకపోయాడు వినాయక్.

బాలయ్య నో అన్నాక మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌ను ట్రై చేశాడు వినాయక్. కానీ కొన్ని రోజుల చర్చల తర్వాత ఆ సినిమా కూడా ముందుకు కదల్లేదు. ‘ఎఫ్-2’తో మళ్లీ మంచి ఊపులోకి వచ్చిన వెంకీ.. ఆ సినిమా ఫలితం తర్వాత మనసు మార్చుకున్నాడట. ఇప్పుడున్న స్థితిలో వినాయక్‌తో సినిమా చేస్తే తిరోగమనమే అని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు వేరే హీరోలెవ్వరూ కూడా వినాయక్‌కు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. చూస్తుంటే సమీప భవిష్యత్తులో వినాయక్ సినిమా రావడం కష్టంగానే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English