నోరు అదుపులో పెట్టుకోండి.. బాలయ్య వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం వైసీపీ నాయకులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపం చెందిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో కన్నీటి పర్యంతం కావడం నందమూరి కుటుంబాన్ని బాగానే కదిలించినట్లుంది. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పురంధరేశ్వరి తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక శనివారం నందమూరి బాలకృష్ణ సహా పలువురు నందమూరి కుటుంబ సభ్యులు కలిసి హిందూపురంలో విలేకరుల సమావేశం పెట్టారు. బాలయ్యతో పాటు ఆయన సోదరి లోకేశ్వరి, సోదరుడు రామకృష్ణ, హరికృష్ణ కూతురు సుహాసిని తదితరులు ఈ సమావేశం మాట్లాడారు.

ముందుగా బాలయ్య మాట్లాడుతూ.. తన సోదరి పట్ల వైసీపీ నాయకులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు దారుణం అన్నారు. ఏదైనా ఉంటే రాజకీయంగా చర్చించాలి తప్ప వ్యక్తిగతంగా వెళ్లడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇలాంటివి చూస్తే అది గొడ్ల చావిడిలా కనిపిస్తోందన్నారు. వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన అంశం తెరపైకి రాగా.. దాన్నుంచి అందరి దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇందులోకి తన సోదరి భువనేశ్వరి పేరును తీసుకురావడం దారుణమని బాలయ్య వ్యాఖ్యానించారు.

వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఇలాగే మాట్లాడితే వారి భరతం పడతామని బాలయ్య హెచ్చరించారు. ఇంతకుముందే తమ కుటుంబం మీద చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించాలని అనుకున్నప్పటికీ.. చంద్రబాబు వద్దని వారించారని.. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్లు హద్దులు దాటిపోయారని.. ఇకపై తమకు చంద్రబాబు అనుమతి అవసరం లేదని, ఇలాంటివి అస్సలు ఉపేక్షించేది లేదని బాలయ్య స్పష్టం చేశారు.

మరోవైపు లోకేశ్వరి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చాలా హుందాగా ఉంటారని.. విజయమ్మను కానీ, భారతిని కానీ, షర్మిళను కానీ ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదని.. ఆయనది అలాంటి సంస్కృతి కాదని.. కానీ తమ సోదరి గురించి ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడం ఎంతమాత్రం సమంజసం కాదని.. తన తమ్ముడు బాలయ్య అన్నట్లు తమలో ఇంకో అవతారం ఉందని.. అది చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

రామకృష్ణ ఈ విషయమై మాట్లాడుతూ.. కన్నీటి పర్యంతం అయ్యారు. తన సోదరి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఒరేయ్ నానిగా, ఒరేయ్ వంశీగా, ఒరేయ్ అంబటి రాంబాబు.. ఒరేయ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. మా కుటుంబం గురించి ఇంకోసారి మాట్లాడితే బాగోదు. మీ భవిష్యత్ ఎలా ఉంటుందో మీకే తెలియదు’’ అన్నారు.