‘మజిలీ’ దానికి కాపీ అనేయొచ్చు

‘మజిలీ’ దానికి కాపీ అనేయొచ్చు

టాలీవుడ్ బాక్సాఫీస్‌కు చాన్నాళ్ల తర్వాత మంచి ఊపు తీసుకొచ్చింది ‘మజిలీ’ సినిమా. మంచి టాక్ తెచ్చుకుని, చక్కటి వసూళ్లతో సాగిపోతోందీ చిత్రం. ఈ సినిమాపై ఇటు సామాన్య ప్రేక్షకులు, అటు విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ కూడా ప్రశంసల వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు. అతడిని ఈ తరం మణిరత్నం అంటున్నవాళ్లూ లేకపోలేదు.

ఐతే ‘మజిలీ’ సినిమా ఒక క్లాసిక్‌కు ఒక రకంగా ఫ్రీమేక్ అనే విషయాన్ని గుర్తించిన వాళ్లు తక్కువమందే. మణిరత్నంతో శివను పోలుస్తున్న వాళ్లు.. మణిరత్నం తీసిన సినిమా కథనే కొంచెం అటు ఇటు మార్చి శివ ‘మజిలీ’ తీశాడన్న విషయం కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా..? మణిరత్నం కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చిన ‘మౌనరాగం’.

33 ఏళ్ల కిందట వచ్చిన ‘మౌనరాగం’ అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు చూసినా రిఫ్రెషింగ్‌గా, మంచి ఫీల్ కనిపించే సినిమా ‘మౌనరాగం'. ఆ చిత్రంలో రేవతి పాత్రను స్ఫూర్తితో నాగచైతన్య పాత్రను.. మోహన్ పాత్ర ఇన్‌స్పిరేషన్‌తో సమంత పాత్రను తీర్చిదిద్దుకున్నట్లుగా ఉన్నాడు శివ. పాత్రల్ని రివర్స్ చేశాడు.. కథ మాత్రం దాదాపుగా అదే. అందులో రేవతి పెళ్లికి ముందు కార్తీక్‌ను ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్న తరుణంలో అనుకోకుండా కార్తీక్ చనిపోతాడు. తండ్రి బలవంతం మేరకు మోహన్‌ను పెళ్లి చేసుకుంటుంది రేవతి. కానీ అతడిని దగ్గరికి రానివ్వదు. మోహన్‌ మాత్రం ఆమెను సిన్సియర్‌గా ఇష్టపడతాడు. ఆమెను మెప్పించడానికి చేయాల్సిందల్లా చేస్తాడు. కానీ ఆమె మనసు కరగదు. కానీ చివరికి భర్త ప్రేమను గుర్తించి అతడికి దగ్గరవడంతో సినిమా ముగుస్తుంది.

‘మజిలీ’లో దాదాపుగా కథ ఇలాగే సాగుతుంది. కాకపోతే హీరో హీరోయిన్ల పాత్రలు రివర్స్. పెళ్లికి ముందు చైతూ ప్రేమలో పడతాడు. కానీ ప్రేమించిన అమ్మాయికి దూరమవుతాడు. తండ్రి కోసం సమంతను పెళ్లాడతాడు. కానీ ఆమెను దగ్గరికి రానివ్వడు. సమంత మాత్రం భర్త విషయంలో చాలా సిన్సియర్‌గా ఉంటుంది. చివరికి ఆమె ప్రేమను గుర్తించి తనను దగ్గరికి తీసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. ఐతే కథ విషయంలో స్ఫూర్తి పొందినా.. కథనం విషయంలో తనదైన టచ్ ఇవ్వడం ద్వారా శివ దీన్ని ప్రేక్షకుల హృదయాలకు చేరువ చేయగలిగాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English