సూపర్ స్టార్.. మళ్లీ మోసం చేయడు కదా?

సూపర్ స్టార్.. మళ్లీ మోసం చేయడు కదా?

సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి నిఖార్సయిన హిట్టు సినిమా ఎప్పుడొచ్చిందో కూడా జనాలు మరిచిపోయారు. ఎప్పుడో తొమ్మిదేళ్ల కిందట ‘రోబో’తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు రజనీ. ఇక అప్పట్నుంచి ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయి. వెళ్తున్నాయి. ప్రతి చిత్రం మీదా ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. కానీ ఏదీ కూడా ఆ అంచనాల్ని నిలబెట్టడం లేదు.

ఏ సినిమా మొదలైనా మొదట్లో రిలీజ్ చేసే ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే వావ్ అనిపిస్తుంది. చాలా క్రియేటివ్‌గా, ఆకర్షణీయంగా ఉండే ఈ పోస్టర్లు చూశాక ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతాయి. కానీ తీరా సినిమా చూస్తే అంత విషయం ఉండదు. కొన్నేళ్ల కిందట ‘కబాలి’ ఫస్ట్ లుక్ పోస్టర్లు.. దాని టీజర్ ఎంతటి సంచలనం రేపాయో తెలిసిన సంగతే. కానీ సినిమా చూస్తే అంత విషయం లేకపోయింది. తీవ్ర నిరాశకు గురయ్యారు ప్రేక్షకులు.

రజనీ మిగతా సినిమాల వ్యవహారం కూడా అంతే. ఆయన చివరి సినిమా ‘పేట’కు కూడా అదిరిపోయే ప్రోమోలు వదిలారు. వాటిలో రజనీ మేకోవర్ చూసి వారెవా అనుకున్నారు. కానీ సినిమా మాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. గతంలో రజనీ సినిమాలు ఫ్లాపైనా భారీగా వసూళ్లు వచ్చేవి. కానీ ‘పేట’ తుస్సుమనిపించింది. ఇప్పుడు రజనీ కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రానికి ‘దర్బార్’ అనే టైటిల్ ఖరారు చేశారు.

రజనీ చాలా ఎనర్జిటిగ్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ ద్వారా చాలా విషయాలు చెప్పాలని చూశారు. గన్స్.. పోలీస్ బెల్ట్, టోపీ.. ముంబయి గేట్.. పోలీస్ డాగ్.. ఇలా చాలా విషయాల్ని కవర్ చేశారు. ఇది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. సినిమా మీద అంచనాల్ని పెంచేలా ఉంది పోస్టర్. కానీ ఇదైనా ఈ అంచనాల్ని అందుకుంటుందా.. లేక ఎప్పట్లాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌కు, సినిమాకు సంబంధం లేకుండా రజనీ ఆడియన్స్‌కు మరోసారి ఝలక్ ఇస్తాడా అన్నది చూడాలి. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English