భలే ఉంది సినిమాల వరస

భలే ఉంది సినిమాల వరస

ఈ వేసవికి ‘మజిలీ’ సినిమాతో మంచి ఆరంభం లభించింది. రెండు నెలలుగా వెలవెలబోతున్న బాక్పాఫీస్‌కు మళ్లీ ఊపు తెచ్చింది ఈ చిత్రం. ఈ సినిమాపై ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉంది. రిలీజ్ దగ్గర పడే కొద్దీ అంచనాలు పెరిగాయి. సినిమా అంచనాలకు తగ్గట్లుగా ఉండటంతో మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. చాన్నాళ్ల తర్వాత ఇటు యూత్.. అటు ఫ్యామిలీస్ థియేటర్లకు కదులుతున్నాయి ‘మజిలీ’ కోసం. దీని తర్వాతి వారాల్లో రానున్న సినిమాల చుట్టూ కూడా ఒక పాజిటివిటీ కనిపిస్తోంది.

ఈ వారం ‘చిత్రలహరి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సాయిధరమ్ తేజ్ వరుసగా ఆరు ఫ్లాపులు కొట్టినా కూడా ‘చిత్రలహరి’కి మాత్రం పాజిటివ్ బజ్ ఉంది. దీని టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి. కథాబలం ఉన్న సెన్సిబుల్ సినిమాలా అనిపిస్తోంది ‘చిత్రలహరి’. ఇంకో వారం తర్వాత రాబోయే నాని సినిమా ‘జెర్సీ’ మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. దీని టీజర్, ఇతర ప్రోమోలు ఇంటెన్స్‌గా ఉండి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ఇది కూడా మంచి ఎమోషన్ ఉన్న కథతో తెరకెక్కిన సినిమానే.

‘మజిలీ’తో పాటు తర్వాతి రెండు సినిమాలు కూడా యూత్, ఫ్యామిలీస్‌ను ఆకట్టుకునే క్లాస్ టచ్ ఉన్న సినిమాలే. తర్వాతి రెండు సినిమాలు కూడా అంచనాల్ని అందుకుంటే సమ్మర్ సీజన్ జోరు మామూలుగా ఉండదు. ‘జెర్సీ’తో పాటు రాబోయే ‘కాంఛన-3’ మాస్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా కచ్చితంగా హిట్టయ్యే సినిమాలాగే అనిపిస్తోంది. తర్వాత మే నెలలో ‘మహర్షి’.. ‘డియర్ కామ్రేడ్’ లాంటి క్రేజీ సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English