నేను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగాం: పురందేశ్వరి

ఏపీ అసెంబ్లీలో ఈ రోజు జరిగిన ఘటన రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన వాదోపవాదాల్లో తన సతీమణిని వైసీపీ ఎమ్మెల్యేలు కించపరిచే విధంగా మాట్లాడారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. తాను తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు.

ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి దగ్గబాటి పురందేశ్వరి స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యాలను ఆమె ఖండిచారు. భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆమె భావోద్వేగానికి గురయ్యారు. వ్యక్తిత్వ హననం సహేతుకం కాదన్నారు. తానూ, తమ సోదరి నైతిక విలువలతో పెరిగామని పురందేశ్వరి తెలిపారు. విలువల్లో రాజీ ప్రసక్తే లేదని పురందేశ్వరి స్పష్టం చేశారు. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఇవాళ జరిగిన ఘటనతో తన మనసు నిజంగా గాయపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. భువనేశ్వరికి ఎన్టీఆర్‌ కుటుంబం సంఘీభావం ప్రకటించింది.

భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని, వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతో బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేయడం తగదని హితవుపలికారు.

భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు. ఎంపీలు సుజానా చౌదరి, రఘురామకృష్ణరాజు తీవ్రంగా తప్పుబట్టారు. తన సతీమణిని కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడారని చంద్రబాబు కంట తడి పెట్టడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమన్నారు. మహిళలను కించపరచడం, వారి గౌరవ ప్రతిష్ఠకు హాని కలిగించడాన్ని పవన్ కల్యాణ్ వ్యతిరేకించారు.

అయితే అసెంబ్లీలో చంద్రబాబుని, ఆయన కుటుంబసభ్యులను, మహిళలను కించపరిచే విధంగా తానేమీ అనలేదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అవసరమైతే వీడియోలు చూడాలన్నారు. చంద్రబాబే అలిగి అసెంబ్లీ నుంచి వెళ్లారని పేర్కొన్నారు. వెళ్తూ వెళ్తూతిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేసి వెళ్లారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు కుటుంబసభ్యులపై అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మంగళగిరి అంబేడ్కర్‌ సెంటర్‌లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు శుక్రవారం ధర్నా చేసి వైసీపీ ఎమ్మెల్యేల చిత్రపటాలను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో అటుగా వెళుతున్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య వాహనాన్ని నేతలు అడ్డుకున్నారు. చివరకు పోలీస్‌ ఎస్కార్ట్‌ సాయంతో రోశయ్య వాహనం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.