బన్నీ-త్రివిక్రమ్.. పేరు తప్ప అన్నీ

బన్నీ-త్రివిక్రమ్.. పేరు తప్ప అన్నీ

అల్లు అర్జున్ చివరి సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ గత ఏడాది మే 4న రిలీజైంది. చూస్తుండగానే సంవత్సరం గడిచిపోతున్నా.. బన్నీ ఇంకా తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేదు. త్రివిక్రమ్‌తో తన తర్వాతి చిత్రాన్ని ఖరారు చేసినప్పటికీ.. ఇంకా షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు. దీంతో అభిమానులు అసహనానికి గురవుతున్నారు. ఐతే ఎట్టకేలకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 24న ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని ప్రకటించారు. ఇంకా సినిమాకు సంబంధించి ఇతర విశేషాల్ని కూడా అధికారికంగా వెల్లడించారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది. ఆమె పేరును పోస్టర్‌పై వేశారు.

రెండో హీరోయిన్‌గా కేథరిన్ థ్రెసా అని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆమె పేరు పోస్టర్ మీద లేదు. త్రివిక్రమ్ గత చిత్రం ‘అరవింద సమేత’కు సంగీతం సమకూర్చిన తమనే ఈ చిత్రానికి కూడా పని చేయబోతున్నాడు. అలాగే ‘అరవింద సమేత’కు ఛాయాగ్రహణం అందించిన పి.ఎస్.వినోద్‌ను కూడా కంటిన్యూ చేస్తున్నాడు త్రివిక్రమ్. నవీన్ నూలి ఎడిటింగ్, ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్న సంగతి తెలిసిందే. మొత్తానికి టైటిల్ తప్పిస్తే సినిమాకు సంబంధించి అన్ని వివరాలూ చిత్ర బృందం ప్రకటించేసింది. ఈ చిత్రాన్ని నాలుగు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. బన్నీ తన వరకు రెండు నెలల డేట్లు ఇచ్చాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English