అరగంట ఏడ్చిన సమంత

అరగంట ఏడ్చిన సమంత

అరగంట ఏడవడమా.. సమంతకు అంత కష్టం ఏమొచ్చింది అని ఆశ్చర్యపోతున్నారా..? ఐతే ఇది బాధ వల్ల వచ్చి ఏడుపు కాదు.. సంతోషంతో వచ్చింది. తన భర్త అక్కినేని నాగచైతన్యకు ‘మజిలీ’ రూపంలో మంచి విజయం దక్కిన నేపథ్యంలో ఆమె ఇలా ఉద్వేగానికి గురైందట. ‘మజిలీ’లో సమంత కూడా నటించింది. ఐతే ఆమెకు విజయాలు కొత్తేమీ కాదు. నాన్-బాహుబలి రికార్డ్ బ్రేకింగ్ ‘రంగస్థలం’ సహా ఎన్నో బ్లాక్ బస్టర్లు ఆమె ఖాతాలో ఉన్నాయి.

కానీ ఆమె భర్త నాగచైతన్య పరిస్థితే ఏమీ బాగా లేదు. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అనేలా ఉంది అతడి కెరీర్. అతడి చివరి మూడు సినిమాలూ ఫ్లాపులే అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైతూ కెరీర్‌కు ‘మజిలీ’ చాలా కీలకంగా మారింది. ఈ సినిమా పోతే అతడి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది.

అందుకే సమంత ‘మజిలీ’ విడుదలకు ముందు చాలా టెన్షన్ పడిందట. రాత్రి అసలు సరిగా నిద్రే పోలేదట. అర్ధరాత్రి తర్వాత రెండున్నరకే లేచేసిందట. యుఎస్‌లో ఆ సమయానికి ప్రిమియర్ షోలు నడుస్తుండటంతో వాటి రిజల్ట్ కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూసిందట. ఇంట్లో ఇటు అటు తిరుగుతూ టెన్షన్ పడిందట. ఐతే కాసేపటి తర్వాత ‘మజిలీ’ నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటి ఫోన్ చేసి సినిమాకు మంచి స్పందన వస్తోందని చెప్పాడట. సినిమా సక్సెస్ అని తేలాక తాను ఉద్వేగంతో అరగంట పాటు ఏడ్చినట్లు సమంత వెల్లడించింది.

చైతూ కెరీర్ ఇప్పుడు ఏ స్థితిలో ఉందో అందరికీ తెలుసని.. ఈ సినిమా ఆడకపోతే అతడికి ఏం సమాధానం చెప్పాలో కూడా తనకు అర్థం కాలేదని.. అందుకే ‘మజిలీ’కి వస్తున్న స్పందన తనకెంతో ఉద్వేగం కలిగిస్తోందని సమంత చెప్పింది. రిలీజ్ రోజు తన మావయ్య నాగార్జున తమను అభినందించడం కోసం చెప్పకుండా ఉన్నట్లుండి ఇంటికి వచ్చి తమను సర్ప్రైజ్ చేశాడని.. ఆయన కూడా ఈ సక్సెస్ పట్ల చాలా సంతోషంగా ఉన్నారని సమంత చెప్పింది. మొత్తానికి తన భర్త విషయంలో సమంత చాలా ఎమోషనల్ అనే విషయం ఆమె మాటల్ని బట్టి మరోసారి రుజువైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English